Friday, April 19, 2024

నో వ్యూస్

Too-much: పత్రికకు సర్క్యులేషన్ కొలమానం. టీ వీ లకు ఒకప్పుడు టీ ఆర్ పి, ఇప్పుడు బార్క్ లు కొలమానం. డిజిటల్ మీడియాకు వ్యూస్, సబ్ స్క్రిప్షన్, లైకులు, షేర్లు కొలమానం. ఇందులో ఏవి ఎంత ప్రామాణికమంటే…అంతా దేవతా వస్త్రం కథే.

ప్రకటనలు ఇచ్చేవారికి ఏదో ఒక కొలమానం ఉండాలి కాబట్టి ఇవే పరమ ప్రామాణికంగా చలామణి అవుతున్నాయి. సర్క్యులేషన్ సంఖ్య, పాఠకుల సంఖ్య ఒకటి కాదు. ఒక ఇంట్లో ఒక పత్రికను ముగ్గురో, నలుగురో చదువుతారన్న అంచనాతో పాఠకుల సంఖ్యను లెక్కిస్తారు. డిజిటల్ దెబ్బకు సంప్రదాయ ప్రింట్ మీడియా గింగిరాలు తిరుగుతోంది. డిజిటల్ మీడియా చట్రంలోకే సంప్రదాయ టీ వీ మీడియా కూడా ఒదిగిపోతోంది.

పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీ వి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం అందంగా ఉండడం వల్ల లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపలనుండి తన్నుకొచ్చే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూ ట్యూబుల్లో పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. వాటికి జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. క్షణక్షణానికి అందగించే తమ ముఖారవిందాలను వెను వెంటనే డి పి లుగా పెట్టుకుని లోకాన్ని అనుగ్రహించాలనిపిస్తూ ఉంటుంది. లక్షల వ్యూస్, లైకులు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది.

వ్యక్తిగతం, దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్.
“ఇప్పుడే నిద్ర లేచి బాత్ రూమ్ వెళుతున్నా”
– ఒక అప్ డేట్.

“హ్యాపీ నేచర్ కాల్”
-దానికి రిప్లై.

పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయటా ఏదయినా లోకానికి చెప్పాలి. ఒకరిని చూసి ఒకరు…నువ్ తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్లు డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు.

వ్యూస్ బాగా వస్తే ఆనందం; ఉత్సాహం; ఉక్కిరిబిక్కిరి. రాకపోతే వైరాగ్యం; నిరుత్సాహం; నైరాశ్యం. అలాంటి నైరాశ్యంలో హైదరాబాద్ లో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐ ఐ టీ లో చదివిన విద్యార్థి. యూట్యూబ్ వ్యూస్ రాకపోవడం ఒక్కటే ఇతడి ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు. ఇతరేతర కారణాలు యూ ట్యూబ్ వైఫల్యంతో బద్దలయినట్లుంది.

మనం డిజిటల్ మీడియాలో తరచుగా ఏమి సెర్చ్ చేస్తున్నామో పసిగట్టి వాటినే మన కళ్ల ముందుకు తోసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- కృత్రిమ మేధ మీద తెరవెనుక జరిగేవి తెలుసుకుంటే…వడ్లగింజలో బియ్యపు గింజలు బయటపడతాయి.

డిజిటల్ డిస్టెన్స్
డిజిటల్ డివైడ్
డిజిటల్ డీటాక్సిఫికేషన్
డిజిటల్ ఇమ్యూనిటీ
డిజిటల్ డీ అడిక్షన్

అని కొత్త డిజిటల్ పరిభాష కూడా పుట్టుకొచ్చింది. మాదక ద్రవ్యాలు, లిక్కర్ ఎక్కువగా తీసుకునే వారికి డీ అడిక్షన్ కేంద్రాలు ఉన్నట్లు…మన శరీరాల్లో డిజిటల్ వైరస్ ను డీ టాక్స్ చేసి…డిజిటల్ ఇమ్యూనిటీని పెంచడానికి ఇక రావాల్సినవి డిజిటల్ డీ అడిక్షన్ కేంద్రాలే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్