Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆత్మహత్యలు పరిష్కారం కాదు

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

Tragedy Stories: జీవితం సుఖంగా ఉండడానికి ఏం కావాలని ఎవరినైనా అడగండి. డబ్బు, అందం ఉండాలని నూటికి తొంభై మంది చెప్తారు. డబ్బుతో ఏదైనా చెయ్యచ్చు, కొనచ్చనే అభిప్రాయమే ఇందుకు కారణం. అందుకే అందం, డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని చూసి వారిదే అదృష్టమంతా అనుకుంటారు. గ్లామర్ రంగాల్లో ఉన్నవారే ఇందుకు ఆదర్శంగా చూపుతారు. కానీ అటువంటి సెలబ్రిటీ లే ఈ మధ్య ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది వారి అభిమానులను అయోమయం లోకి నెట్టేస్తోంది.

అతనో చక్కటి నటుడు. స్వయంకృషితో ఉదయ కిరణంలా పైకి వచ్చాడు. తనలాగే ఎదిగిన సీనియర్ హీరోకి అల్లుడు కాబోయి తప్పుకున్నాడు. ఆ తరవాత తెరపైన, జీవితంలో వైఫల్యాలు వెక్కిరించాయి. కొన్నాళ్ళు పోరాడాడు. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

చక్కగా చదువుకుని, నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చిన మంచి మనసున్న యువ హీరో సుశాంత్ డిప్రెషన్ బారిన పడి ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని అభిమానులను శోకంలో ముంచేశాడు. చక్కటి కెరీర్, ఫ్రెండ్స్ … అతని మనోవేదన తగ్గించలేకపోయాయి. ఎందరికో ఆదర్శాలు చెప్పి, చేసి చూపించిన ఆ హీరో డిప్రెషన్ కు బలి కావడం విషాదం.

ఆటగాడైన తండ్రి శిక్షణలో గొప్ప క్రీడాకారిణి కావలసిన దీపికా పడుకోన్ సినీ రంగంలో రాణించాలని ముంబయి చేరుకుంది. అనుకున్నది సాధించింది. ఉన్నత స్థాయికి చేరుకుంది. అంతలోనే అంతులేని ఒంటరితనం అనుభవించింది. ఆదుకునేవారు కరువయ్యారు. కన్నవారు గమనించి ఆసరాగా నిలిచారు. ఈ రోజున దేశంలోనే ప్రముఖ తారగా తన అనుభవాలు చెప్తూ డిప్రెషన్ కి గురయిన వారికి సహాయం చేస్తోంది. కానీ అందరికీ ముగింపు ఇలా ఉండదు.

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలవారికి స్నేహితులు, చుట్టాలు ఎక్కువగా ఉంటారు. ఏ చిన్న సందర్భమయినా అందరూ కలుస్తారు. అయితే సెలబ్రిటీ కెరీర్ పరుగులో తమ వారికి దూరం అవుతారు. తమ చుట్టూ ఒక గోడ కట్టుకుంటారు. చివరకు ఆ గోడ దాటలేక, లోనికి ఎవర్నీ పిలవలేక మానసికంగా ఒంటరివారై మృత్యువును ఆహ్వానిస్తున్నారు. ఎదిగే క్రమంలో కొన్ని అలవాట్లు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. వీరి చుట్టూ ఎంతోమంది ఉన్నా మనసెరిగినవారు లేకపోవడం అసలు సమస్య. కొందరు అన్నీ బాగున్నాయనే భ్రమల్లో తమ స్థాయికి మించి కనిపించడానికి అప్పులు చేసి ఆడంబరాలకు పోతున్నారు. ఖరీదైన దుస్తులు, కారు, పోష్ ఏరియాలో ఇల్లు ఉండాలని,అప్పుడే పరిచయాలు, అవకాశాలు బాగుంటాయని శక్తికి మించి ఖర్చు పెడతారు. తీరా అవకాశాలు రాక , అప్పులు తీరే మార్గం లేక కుంగుబాటుకు లోనవుతారు. కొంతమంది సున్నిత మనస్తత్వం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.

అప్పులకు మించిన ఆస్తులున్నా, అప్పులిచ్చినవారి ఒత్తిడి భరించలేక అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త గురించి తెలిసిందే. ఈ రోజున అదే వ్యాపారం అతని భార్య ఆధ్వర్యంలో పుంజుకుని అప్పులు తీర్చే దశలో ఉంది. మరి పోయిన ప్రాణాన్ని తీసుకు రాగలమా? ఈ మాత్రం ఆలోచన అతనికి ఎందుకు లేకపోయిందో అనిపించక మానదు.

తాజాగా హైద్రాబాదులో ఫాషన్ డిజైనర్ ఆత్మహత్య కూడా అంతే. వృత్తిలో ఉన్నత స్థాయి కోసం పరితపించి, ఆ స్థాయికి చేరుకుని కూడా మనసెరిగిన తోడు లేకపోవడం, ఒంటరితనం మానసిక అశాంతికి కారణమై ప్రాణం తీసుకునేలా ప్రేరేపించింది.

సాధారణంగా ప్రాణం తీసుకోవాలని ఎవరికీ ఉండదు. ఎన్ని సమస్యలున్నా దాటాలనే ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆసరాగా వారితో ఎవరున్నారు అనేది చాలా ముఖ్యం. వారి మూడ్ గమనిస్తూ కనిపెట్టుకుని ఉండే కుటుంబ సభ్యులో, స్నేహితులో ఉండాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎక్కువసేపు ఉండదు. ఆ సమయంలో వారి దృష్టి మళ్ళించ గలిగితే చాలా మరణాలు అప వచ్చంటున్నారు మానసిక నిపుణులు. ఎంతో విలువైన జీవితాన్ని కార్బన్ మోనాక్సయిడ్ తోనో, ఫ్యాన్ కి ఉరి వేసుకోనో అంతం చేసుకోకుండా నవయువతకు దారి చూపి భరోసా ఇచ్చే నేస్తాలు తక్షణ అవసరం.

-కె. శోభ

Also Read :

వాడుక మాటల్లో అడుగడుగునా చావే

Also Read :

పరువుకోసం పరుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్