Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పరువుకు ఈమధ్య పెద్ద చిక్కొచ్చి పడింది. పరువు నిజానికి బ్రహ్మ పదార్థం. అది ఉందనుకుంటే ఉంది. లేదనుకుంటే లేదు. ఉందనుకున్నప్పుడు లేదని లోకం నిరూపిస్తుంది. లేదని ముందే ఒప్పేసుకుంటే ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంది. పరువు, మర్యాద, గౌరవం, హుందాతనం, సభ్యత, సంస్కారం ఇత్యాదులను కొలిచే తక్కెడలు ఉండవు. పరువును కొలిచే తూనిక రాళ్ల కొలమానాలు కూడా ఉండవు.

పరుగు(రన్) అనే మాట కూడా రూపాంతరం చెందితే పరువే అవుతుంది. అంటే పరువు స్టాటిక్ కాదు. డైనమిక్. పరుగెత్తి పరువు నిలుపుకోవాలి. బరువెత్తి పరువు నిలుపుకోవాలి. పరువుకోసం ఎందరో బతికితే, బతకడం కోసం పరువు లేకపోయినా పరవాలేదనుకునే వారు కొందరుంటారు.

ఇంతకంటే పరువు వ్యుత్పత్తి అర్థాల్లోకి వెళ్లడానికి ఇది వేదిక కాదు.

పరువు నష్టం
పరువు కోసం ఒక అకౌంట్ ప్రత్యేకంగా మనకు మనమే ఓపెన్ చేసుకోవాలి. పరువుగల పనులు చేస్తూ ఆ అకౌంట్లో పరువు బ్యాలెన్స్ బరువును పెంచుకుంటూ పోవాలి. ఆ పరువు పోతే- చాలా నష్టం. లాభ నష్టాలు వ్యాపార వాణిజ్యాల్లోనే కాదు. సామాజిక వ్యవహారాల్లో కూడా ఎన్నెన్నో లాభ నష్టాలుంటాయి. మన పరువును మనమే తీసేసుకోవడం తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా ఒకరి పరువుకు మరొకరు నష్టం కలిగించడం మాత్రం తప్పు. అలా చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. పోయిన పరువు ఎంతో న్యాయదేవత త్రాసులో తూచి లెక్కగట్టి పరువుకు సమానమయిన పరిహారం నష్టపరిచిన వ్యక్తి నుండి ఇప్పించవచ్చు.

పరువు పునరుద్ధరణ
పోయిన పరువును పునరుద్ధరించుకోవడానికి శాస్త్రీయ, అశాస్త్రీయ, ధర్మ, అధర్మ, నైతిక, అనైతిక మార్గాలు అనేకం. బలవంతపు పరువుగల వారి మనోభావాలను తక్కువ చేసే అధికారం మనకు లేదు కాబట్టి ఈ మార్గాల న్యాయాన్యాల మీద చర్చకు తావు లేదు.

పరువు మేకోవర్
వికృత రూపానికి నానా మేకప్పులు వేసి సమ్మోహనంగా చేస్తున్నట్లే పరువుకు అనేక మేకోవర్ మెళకువలు ఉంటాయి. లేని పరువుకోసం పరితపించేవారినడిగి తెలుసుకోవాల్సిన మెళకువలివి.

ప్రకృతి పరువు
ఇది సహజమయిన ఆర్గానిక్ పరువు. సామాజిక, ప్రాకృతిక ధర్మాలకు లోబడి మనిషి నడకలో, ఆలోచనలో అణువణువునా ఉంటుంది. సమాజంలో మెజారిటీ జనానికి ఇది జన్మతః ఉంటుంది. కడదాకా ఉంటుంది.

వికృతి పరువు
ఇది బహిరంగంగా చర్చించడానికి వీలు లేనిది. అధికారం, హోదా, పదవి, ధనం, నడమంత్రపు గాలివాటు ఇత్యాదులవల్ల వచ్చిన వికృతమయిన బలవంతపు పరువిది. అవి పోయాక ఆ పరువు కూడా పోతుంది.

పరువు ప్రతిష్ఠ
పరువు బాగా స్థిరపడితే ప్రతిష్ఠ. పరువు ఇటుకలతో గోడ కట్టి, పరువు సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసి, పరువు లప్పంతో నున్నగా చేసి, పరువు పెయింట్ తో బాగా బ్రష్ చేసుకుని ప్రతిష్ఠించుకోవాలి. చాలామంది “ప్రతిష్ఠ” పలుచబడి పలికేటప్పుడు, రాసేప్పుడు “ప్రతిష్ట”
గా తేలిపోతూ ఉంటుంది.

పరువు దివాలా
ఇది కొంచెం కాంప్లెక్స్ సమస్య. కొన్ని కారణాల వల్ల పరువు దివాలా తీస్తుంది. అర్ధ శతాబ్దం కిందివరకు పరువెక్కడ దివాలా తీస్తుందోనని ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు పరువు హత్యలు జరుగుతున్నాయి. న్యాయప్రక్రియలో భాగంగా ఐ పి పెట్టినవారిని అంటే దివాలా తీసినవారిని పరువుగా బతకనివ్వాలే కానీ…వారి పరువుకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరం. అందువల్ల కొందరు దివాలా తీయడానికి ప్రయత్నపూర్వకంగా కృషి చేస్తుంటారు. వీరి ముందు బ్యాంకుల పరువు పోతుంటుంది కానీ…సమాజంలో వారి పరువు వారి వీపుకింద పరుపులా మెత్తగా పడి ఉంటుంది. అంటే ఇది దివాలాతో వచ్చిన దిలాసాతో కూడిన విధివిలాస చిద్విలాస పరువు.

పరువు పంచనామా
ఇది బాగా వాడుకలో ఉన్న పంచనామా. పరువు సమీక్షకు ఇది కీలకం.

పరువు గంగలో
ఎన్ని పాపాలు చేసినా గంగలో మునగగానే ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి. కానీ పరువు గంగలో కలిస్తే మాత్రం…అది పునీతం కాదు. కాబట్టి మనం గంగలో మునిగినా…మునగకపోయినా పరవాలేదు. మన పరువు మాత్రం గంగలో కలవకూడదు.

పరువిచ్చి తెచ్చుకో
మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పరువు కూడా అంతే. ఇచ్చి పుచ్చుకోవాలి.

పరువుకు కరువు
సమాజంలో కొన్ని రంగాల్లో పరువుకు తీవ్రమయిన కరువొచ్చింది. అంబానీ, అదానీ ఫ్యాక్టరీల్లో పరువు తయారు కాదు. కాబట్టి పరువు మార్కెట్లో దొరికే వస్తువు కాదు.

పరువుకోసమే బతుకు.
బతుకుకు పరువే ఆదరువు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

అందమా! అందుమా!

Also Read:

కాలమా! ఆగుమా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com