Beauty matters – Attractive People Are More Likely To Get Hired :

అందం కొరుక్కు తింటారా? అని అందాన్ని ఈసడిస్తూ లోకంలో ఒక మాటుంది. కొరుక్కు తినకపోవచ్చు గానీ…ప్రపంచం అందాన్ని కొనుక్కుని తింటూ ఉంటుంది. అందం కోసం అలమటిస్తూ ఉంటుంది.

అందం కోసం మొహాలను కోసుకుంటూ ఉంటుంది. పొట్టను పర పర కోయించుకుంటూ ఉంటుంది. జుట్టు తెల్లబడితే నలుపు రంగు పులిమి కారు నలుపు అయ్యే దాకా జుట్టును జుట్టుపట్టుకుని నిలదీస్తుంది. చర్మం ముడుతలు పడితే మేకప్ ప్లాస్టరింగ్ చేసి, లప్పం వేసి, ప్యాన్ కేక్ వేసి, సున్నం పూసి అందపు గోడ కడుతుంది. తింటే లావై అందం మందగిస్తుంది కాబట్టి పస్తులుంటుంది. ఉప్పు నిషేధం. తీపి నిషేధం. నూనెలు వాడకూడదు. వేపుళ్లు అందాన్ని వేపుకుతింటాయి కాబట్టి వదిలేయాలి. ఎముకల పోగులా, సన్నని రివటలా, జీవచ్ఛవంలా సైజ్ జీరోలో బతకడానికి లోకం చచ్చిపోతూ ఉంటుంది.

అందమే ఆనందం అని నిర్వచనం స్థిరపడిపోయింది. ఆ అందంతో వచ్చిన ఆనందమే జీవన మకరందమై ప్రపంచాన్ని ఏలుతోంది.

అందాల తార పెదవి కొరికి మాజా తాగితే…లోకం నాలుక కరుచుకుని అదే మాజా తాగడంలో మజాను వెతుక్కుంటుంది. అందగాడు పిరమిడ్ సమాధి పైనుండి గాలిబుడగ మీద పడి మోచేతులు దోక్కుపోయి ఆబగా థమ్స్ అప్ తాగితే…లోకం కూడా ఎగబడి అదే థమ్స్ అప్ తాగుతుంది. అందం బట్టల్లేకుండా బట్టలు తొడుక్కోవాలని వస్త్ర సందేశం ఇస్తేనే లోకం బట్టకడుతుంది. అందం అన్నం తిను అంటే లోకం తింటుంది. మానేయ్ అంటే మానేస్తుంది. అందం లోకాన్ని ఆడిస్తుంది.

వయసును దాచే లేదా వయసును దాచినట్లు భ్రమింపచేసే యాంటీ ఏజింగ్ క్రీములు, మొయిశ్చరైజర్లు, పౌడర్లు లాంటి సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ విలువ ఒక్క భారత్ లోనే ఏటా అక్షరాలా యాభై వేల కోట్ల రూపాయలు. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా ఏటా లేని అందం కోసం భూగోళం చేసే ఖర్చు కొన్ని లక్షల కోట్లు.

నిజమే.
అనాదిగా- మింగ మెతుకు లేకపోయినా మీసాలకు మంచి సంపంగి నూనె రాసుకోవాల్సిందే. కంటికి మించి కాటుక పూసుకోవాల్సిందే. తినడానికి పట్టెడన్నం లేకపోయినా కట్టుకోవడానికి పట్టుబట్టలు ఉండాల్సిందే. అల్లుడు అడుక్కుతినడంలో మాస్టర్స్ చేసి ఈగలు తోలుకుంటున్నా కాలికి బూట్లు, చేతికి వాచీ, నడుముకు గోచీ, వేలికి ఉంగరం, మెడకు గొలుసు ఉండాల్సిందే. అత్త సొమ్ముతో అల్లుడి అందం పెరగాల్సిందే.

సాధారణంగా లోకం అందంగానే ఉంటుంది. సరిగ్గా పెళ్లి చూపులు, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు అనగానే జాతర మొదలవుతుంది. ప్రకృతి వికృతి అవుతుందో? లేక వికృతే మరింత వికృతిగా జడలు విప్పి నర్తిస్తుందో? కనుక్కోవడం కష్టం. ఈమధ్య ఒక ఆఫ్రికా దేశంలో కోర్టు ముందుకు ఈ ప్రకృతి- వికృతి కేసు వస్తే జడ్జి తల పట్టుకోవాల్సి వచ్చింది. ఒకామె పెళ్లికి ముందు మేకప్ తో ఉండేది. జరగదనుకున్న పెళ్లి జరిగింది కదా! అన్న ధీమాతో మేకప్ లేకుండా కనిపించింది. అంతే- కొత్త పెళ్లి కొడుకు కళ్లు బైర్లు కమ్మి, తల తిరిగి, మనసు ముక్కలై, భవిష్యత్తు వివర్ణమయ్యింది. దాంతో తనకు జరిగిన అందపు మోసానికి, నష్టానికి తగిన పరిహారం ఇప్పించండి మహా ప్రభో! అని కోర్టు మెట్లెక్కాడు.

మనమే కాదు. సర్వసంగ పరిత్యాగులు, మునులు, యతులు, వాగ్గేయకారులు, భక్తులు కూడా అందాన్నే ఆరాధిస్తారు. “చక్కని నీ ముఖ కమలము సదా కనులజూచు”
అన్నాడు త్యాగయ్య.
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ”
అని రాముడి అందం చూడని కళ్లు కళ్లే కావు పొమ్మన్నారు.
యమునా తీర బృందావనంలో రాత్రి వెన్నెల్లో కృష్ణుడు వేణువు వాయించేప్పుడు ఆ అరమోడ్పు కనుల అందమయిన మొహం చూడ్డానికి యమున పొంగిందట. చెట్లు పైకి పెరగడం ఆగి, కిందికి పాకుతున్నాయట. మనుషులు, దేవతలు రెప్పవేయకుండా కళ్లతో ఆ అందాన్ని జుర్రుకుంటున్నారట.

టెంత్ టెన్ టైమ్స్ ఫెయిలై ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న అందమయిన నలభై ఏళ్ల అబ్బాయికి – కారు తెలుపు అందమయిన అమ్మాయి కావలెను- అని ఇప్పటికీ పెళ్లి ప్రకటనలు చూస్తున్నాం.

ఊరి జనం తెగని ఒక సమస్యతో తలలు పట్టుకుని కూర్చుని ఉంటే – రిన్ బట్టలతో ఉతికిన తెలుపు వల్ల తళతళలాడే ఒక అందమయిన అమ్మాయి వచ్చి ఆ సమస్యను చిటికెలో పరిష్కరించడం చూస్తున్నాం.

సంతూర్ సబ్బు వాడడం వల్ల పెద్దమ్మ కాస్త అందమయిన కాలేజీ అమ్మాయి అనుకుని మహేష్ బాబు వెంటపడబోయి…ఆ పెద్దమ్మ చిన్ని కూతురు లాస్ట్ ఫ్రేమ్ లో అమ్మా! అని అరవగానే…మహేష్ బాబుతో పాటు మనం కూడా నాలుక కరుచుకుంటున్నాం.

అందం ఒక ఆరాధన.
అందం ఒక సాధన.
అందం ఒక తపన.
అందం ఒక అవసరం.
అందం ఒక ఆత్మ విశ్వాసం.
అందం ఒక పెట్టుబడి.
అందం ఒక వల.
అందం ఒక కల.
అందం ఒక తళతళ.
అందం ఒక విలవిల.

అందంగా ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా రావడానికి కారణాలేంటో కనుక్కుందట అమెరికాలో ఒక యూనివర్శిటీ. అందంగా ఉన్నవారి అందం కంటే మాట్లాడకుండానే వారు ప్రపంచాన్ని జయించగలరని; నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో అందమయినవారికి అడ్వాంటేజ్ ఉంటుందని వీరి పరిశోధనలో తేలిందట. ఎంతమందిని అధ్యయనం చేస్తే ఈ కంక్లూజన్ కు రాగలిగారు అన్న వివరాల్లో స్పష్టత లేదు. అందానికి లోకం దాసోహం అని మాత్రం వీరి అధ్యయనంలో తేలింది.

ఒక పక్క శరీరం రంగు, పొడుగు- పొట్టి, కులం, మతం, ప్రాంతం లాంటి వివక్షలను దాటి మనిషి మరో ప్రపంచం వైపు దూసుకెళుతుంటే…
మరో పక్క అవే అడ్డు గోడలు ఇంకా బలంగా, ఇంకా ఎత్తుకు కట్టే భావజాలాలు కూడా దూసుకెళుతూ ఉంటాయి.

తళుకు బెళుకు రాళ్ల ముందు నిక్కమయిన నీలం వెలవెలబోయే రోజులొస్తాయని తెలియక-
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేలా?
అని వేమన అని ఉంటాడు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: బుల్లెట్ బండెక్కి వత్తా పా

Also Read: వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *