చైనా బెదిరింపులకు తలోగ్గని తైవాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ పసిఫిక్ దేశాల కూటమిలో సభ్యత్వం కోసం తైవాన్ దరఖాస్తు చేసింది. కూటమిలో చేరితే తైవాన్ కు మరింత నైతిక మద్దతు అంతర్జాతీయంగా లభిస్తుంది. వాణిజ్య పరంగా ఇతర దేశాలతో లావాదేవీలు పెరుగుతాయని, తదనుగుణంగా దౌత్య సంబంధాలు బలపడతాయని తైపే వర్గాలు భావిస్తున్నాయి.

ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం కోసం సమగ్ర, ప్రగతిశీల ఒప్పందం(CP-TPP)లో 11 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ కూటమిలో కెనడా, జపాన్, మలేషియా, బ్రూనై, మెక్సికో, పెరు, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం, చిలీ, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. 2018 ప్రథమార్థంలో చిలి రాజధాని సాంటియాగోలో జరిగిన సమావేశంలో comprehensive and progressive agreement for trans pacific partnership(CP-TPP) ఏర్పడింది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల మధ్య ఏలాంటి సుంకాలు లేకుండా కొన్ని రంగాల్లో ఉచిత వాణిజ్యం అమలులో ఉంటుంది.

అయితే తైవాన్ కన్నా ముందే ఈ ఏడాది సెప్టెంబర్ 16 వ తేదిన కూటమి సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసుకుంది. చైనాకు సభ్యత్వం ఇస్తే తైవాన్ కు కష్టాలు తప్పవని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. చైనా – తైవాన్ గొడవల్లో మొదటి నుంచి జపాన్ దేశం తైవాన్ కు దన్నుగా ఉంది. చారిత్రకంగా కూడా చైనాతో జపాన్ కు ఎప్పుడు సఖ్యత లేదు. దీంతో చైనా సభ్యత్వానికి జపాన్ మోకాలడ్డే పరిస్థితి ఉంది. అంతేకాకుండా తైవాన్ కు సభ్యత్వంపై జపాన్ చొరవ తీసుకుంటుంది.

కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి చైనా మీద ఆస్ట్రేలియా గుర్రుగా ఉంది. చైనాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆ దేశంతో ఆస్ట్రేలియా జతకడుతోంది. చైనా దుందుడుకు విధానాలు కట్టడి చేయాలని అంతర్జాతీయ వేదికల్లో ఆస్ట్రేలియా ఘంటాపథంగా వాదిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరణకు చైనా నిర్లక్ష్యమే కారణమని, వారి వల్లే ప్రపంచం మూల్యం చెల్లిస్తోందని ఆస్ట్రేలియా అదే పనిగా విమర్శలు సంధిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా కూడా ట్రాన్స్ పసిఫిక్ కూటమిలోకి చైనా రాకుండా వ్యతిరేకిస్తుంది.

సామ్యవాదం ముసుగులో చైనా సామ్రాజ్యవాద ధోరణి ఏ రోజుకైనా ముప్పేనని సింగపూర్, మలేషియా, కెనడా, వియత్నాం దేశాలు అసంతృప్తితో ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే చైనా ఈ కూటమిలో చేరటం అనుకున్నంత సులువుగా జరగకపోవచ్చు.

CP-TPP కూటమిలోకి వచ్చేందుకు మొదట సుముఖంగా ఉన్న అమెరికా ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. ట్రాన్స్ పసిఫిక్ ఒడంబడికతో మాకు లాభం లేదని అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూటమిలో చేరబోమని ప్రకటించారు. దాంతో కూటమిలో జపాన్ ముఖ్య భూమిక పోషిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *