Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం

నాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం

Sri Chaitanya & Narayana Student Bags All India Ranks in NEET-2021

మా నాన్న తెలుగు ఆచార్యుడు కావడంవల్ల ఇప్పటికీ చదువు సంధ్యలే మా మాటల్లో మొదటి పాయింట్ గా ఉంటుంది. మొదట్లో నాకు చికాకుగా ఉన్నా నెమ్మదిగా అందులో విలువ, తపన తెలిశాయి.

అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుంటే ప్రయోజనమేముంది? అక్షరదోషాల్లేకుండా, అన్వయ దోషాల్లేకుండా ఒక్క వాక్యమయినా రాసి ఆయన మెప్పు పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రతి వాక్యంలో ఒక తప్పును ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇక లాభం లేదనుకుని రాసినవాటిల్లో తప్పులేమిటి అని అడుగుతున్నాను. ఆయన ఓపికగా చెబుతూ ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే…చదువు అవసరంలేని వయసులో ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు?

వైద్య విద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఫలితాలు వచ్చిన మరుసటిరోజు పత్రికలు తిరగేస్తే కలిగిన వైరాగ్యం నుండి పుట్టిన…అపరాధభావంతో కూడిన…అసూయ ఛాయ కలగలిసిన…ఆశ్చర్యం నుండి తేరుకున్న…నా విద్యా విఫల అయోమయం ఈ రాతకు నేపథ్యం.మా రోజుల్లో శ్రీ చైతన్య- నారాయణ లేకపోవడం ఈ బాధకు నేపథ్యం.

మాకు లేని నారాయణ- చైతన్యం ఇప్పటి పిల్లలకు ఉండడం ఈ అసూయకు నేపథ్యం.

మాకు లేని ర్యాంక్ గ్యారెంటీ వెసులుబాటు కోచింగ్ ఇప్పటి పిల్లలకు ఉండడం ఈ చర్చకు నేపథ్యం.

మా ఊళ్లో, కనీసం మా జిల్లాలో ఇంతటి చైతన్యం అప్పుడు లేకపోబట్టే కదా…మేమంతా యూనివర్సిటీ చెట్ల కింద, ఏ పి పి ఎస్ సి కోచింగ్ సెంటర్ల గోడలను ఆనుకుని చదివి…ఏ ర్యాంకూ రాక…ఎందుకూ కొరగాక…ఇళ్లల్లో తిట్లు తింటూ…ఇలా చెట్టుకొకరం పుట్టకొకరం అయ్యాము.

మమ్మల్ను విజయవాడ చైతన్యంలో, హైదరాబాద్ నారాయణంలో గొడ్ల చావిట్లో కట్టేసి ఉంటే ఆలిండియా ఓపెన్ క్యాటగిరిలో ఒకటి ఒకటి ఒకటి అయి రెండో మాటకు అవకాశం లేని విద్యా సరస్వతులం అయ్యేవాళ్లం కదా?తప్పు మాది కాదు. అప్పుడు నారాయణ చైతన్యం లేకపోవడానిది. మాకు మాత్రం పత్రికల్లో అల్లు అర్జున్ కాలిగోటి కింద ఫోటోగా మిగిలిపోవాలని ఉండదా? మాక్కూడా నారాయణ కూతుళ్ల వెనుక నంబర్లుగా నిలుచోవాలని ఉండదా? ఉంటుంది. కానీ…అప్పుడు ఖచ్చితంగా ఎంట్రన్స్ లో వచ్చే పదివేల ప్రశ్నలను ఒడిసిపట్టి మాకిచ్చే నారాయణ లేదే? పరీక్షలో ఖచ్చితంగా వచ్చే అయిదు వేల ప్రశ్నలను మాకు స్పూన్ ఫీడింగ్ ఇచ్చే చైతన్యం లేదే? ఉంటే…అవే చదివేవాళ్లం కదా? మాకు ర్యాంక్ వచ్చి ఈపాటికి పేరుమోసిన డాక్టర్లయి మీ రక్తం కళ్ల చూసేవాళ్లం కదా?

ఇంటర్లో బై పి సి తీసుకోగానే మా పేరు ముందు డాక్టర్ బిరుదు విశేషణ పూర్వపద గౌరవంగా తోడవుతుందని మా తల్లిదండ్రులు ఎన్ని కలలు కన్నారు? వారి కలలు కల్లలు చేసిన సంతానంగా మాకు గిల్టీ ఫీలింగ్ జీవితాంతం ఉండిపోలేదా? తల్లిదండ్రుల కళ్లల్లో ర్యాంకుల ఆనందం వెలుగులు చూడలేని సంతానంగా మా చేతకానితనానికి నిష్కృతి లేదా

యాభై, అరవై వయసులు దాటి…జుట్టు నెరిసి, కంటికి చత్వారం వచ్చిన ఈ వయసుల్లో అయినా నీట్ గా నీట్ లు రాసే అవకాశం మాకు కల్పించాలి. వయోజన విద్యకు నారాయణ చైతన్యం కొత్త చైతన్యం తీసుకురావాలి.

మన ఠీవి పి వి డెబ్బయ్ ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయడం నేర్చుకోలేదా? మన సరస్వతీపుత్ర పుట్టపర్తి డెబ్బయ్ ఏళ్ల వయసులో మృదంగం నేర్చుకోలేదా? మేము యాభైల్లో, అరవైల్లో నీట్ లు, జె ఈ ఈ అడ్వాన్సులు రాయకూడదా? మాకా అవకాశం లేదా? మేమేమన్నా నీరవ్ మోడీలా పదమూడు వేల కోట్ల ఎగ్గొట్టగలిగే రుణమడుగుతున్నామా? తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి లేటు వయసులో చదువుకుంటామని మాత్రమే అడుగుతున్నాం.

ఇప్పటి పిల్లల్లా ఐ ఐ టీ ల్లో చదివి, జి ఆర్ ఈ, టోఫెల్ రాసి, అమెరికాలో ఎం ఎస్ చేసి, పచ్చ కార్డు తెచ్చుకుని, అక్కడే పచ్చటి పచ్చిక బయళ్లలో పచ్చగా బతకాలని మాకు మాత్రం ఉండదా? ఎంతసేపూ ఎర్రమంజిల్ రెడ్ రోజ్ లో ఇరానీ చాయ్ లో ఉస్మానియా బిస్కట్ ముంచుకుని తినే దుస్థితేనా? నిద్రపోని న్యూయార్క్ నగర వీధుల్లో చిల్డ్ బీర్ తాగుతూ…రోజూ వీడియో కాల్లో తల్లిదండ్రులకు హెచ్చరికలు చెబుతూ…డిసెంబర్ సెలవుల్లో మాత్రమే నాలుగురోజులు ఇండియాకు వచ్చి…చేతిలో బిస్లరీ వాటర్ బాటిల్ పట్టుకుని తిరుగుతూ…భుజాలు ఎగరేస్తూ తెలుగును ఇంగ్లీషులా మాట్లాడాలని మాకు మాత్రం ఉండదా?

అప్పట్లో ఎంట్రన్ పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చే అయిదు వేల ప్రశ్నలు మాత్రమే చదివించే నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లు లేక కదా మేమిలా అమీర్ పేట్ రోడ్ల మీద గరీబుల్లా తిరుగుతున్నాం?నీట్ ర్యాంకులు ఎలా సాధించాలో తెలిసిన ఈ చైతన్యలు అప్పుడు లేక కదా ఇప్పుడు మేమిలా అఘోరిస్తున్నాం!

నీట్ నాడి ఒక్క చైతన్యకే తెలియడం వల్ల కదా…మా నాడి ఇప్పటికీ మాకే దొరకడం లేదు?

ఖచ్చితంగా పరీక్షలో వచ్చే అయిదు వేల ప్రశ్నలను చైతన్య మాక్కూడా చెప్పాలి. మేము కూడా నీట్ రాయాలి. వృద్ధులమయిన మేము కూడా ఆలిండియా ఓపెన్ క్యాటగిరిలో నిలబడాలి. మా ఫోటోలు కూడా ఏనాడూ ఎంట్రన్స్ లు రాసి ఎరుగని అల్లు అర్జున్ కాలికింద పడాలి.మా డిమాండుకు కొత్త తరం నైతిక మద్దతు ప్రకటించాలి. సమాజం మాకు అండగా నిలబడాలి. కొడిగట్టిన మా చదువుల దీపం ప్రమిదలో ప్రభుత్వాలే ఉదారంగా రెండు చుక్కల చమురు పోసి…ఒత్తిని ఒత్తి వెలిగించాలి. మా ఆశాదీపం ఆరిపోకుండా నారాయణ- చైతన్య రెండు చేతులు అడ్డుపెట్టాలి !

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

సినిమా చైతన్యం

Also Read:

కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

Also Read:

ఆన్ లైన్ చదువుల వ్యాపారంలోకి శ్రీ చైతన్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్