Thursday, April 3, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిశ్వావసు సంవత్సర ఫలాలు

విశ్వావసు సంవత్సర ఫలాలు

మేషం
ఆదాయం-2; వ్యయం-14
రాజపూజ్యత-5; అవమానం-7

గోచార స్థితిగతులను బట్టి, మేష రాశివారికి సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యసాధనకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకనెల అనుకూలంగా ఉంటే మరో నెల ప్రతికూలంగా ఉంటుంది. పట్టుదలతో ఒత్తిళ్లను జయించాలి. ఈ రాశివారికి ఏలినాటి శని తొలిదశ మొదలైంది. కాబట్టి, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యమివ్వాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనూహ్య ఖర్చులున్నప్పటికీ, తగినంత రాబడి ఉంటుంది. అయినా ఖర్చులను నియంత్రించడం ఉత్తం. శత్రుబాధలు ఉంటాయి. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన జీవన శైలి విజయతీరాలకు చేరుస్తుంది.

కుటుంబంలో కొంత అశాంతి ఉంటుంది. అయినా కలవరపడే పని ఉండదు. సంతానం కారణంగా అనుకోని సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు పాటించడం ద్వారా ఇక్కట్ల నుంచి బయటపడే వీలుంది. ఇంటా బయటా కూడా సంయమనం, స్నేహ భావాలతో ఉండాలి. ఏ వ్యవహారాన్నయినా వాయిదా వేయడం మంచిది కాదు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అనుకోని అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ కూడదు. గ్రహాల అనుకూలత గతుల వల్ల, వివాహాది శుభ కార్యాలు కలిసివస్తాయి. నూతన వస్తు, వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి కొనుగోలు, గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. దేవ, ధర్మ కార్యాలను ఆచరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆశించిన విధంగానే స్థానచలనాలు, పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. చట్ట వ్యతిరేక పనుల కారణంగా చిక్కుల్లో పడే సూచన ఉంది. జాగ్రత్త. ప్రైవేటు రంగంలోని వారికి ఆశించిన ఫలితాలు, ఉన్నతాధికారుల మన్ననలు, ఉత్సాహాన్నిస్తాయి. వృత్తిని విడిచిపెట్టే ఆలోచన చేస్తారు. ఒత్తిళ్లు తాత్కాలికమే అని గుర్తించండి. క్రమేణా ఉద్యోగ వృద్ధి, స్థిరత్వం ఏర్పడతాయి. నిరుద్యోగులు, అధిక శ్రమతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది. కెరేర్ పరంగా మీకు కోపం వచ్చినా, అధికారులకు కోపం వచ్చినా మీరే తగ్గి అణకువగా ఉండడం ద్వారా సత్ప్రయోజనాలను పొందుతారు.

వ్యాపార రంగంలోని వారి ఆర్థిక లావాదేవీలు, క్రయ విక్రయాలు ఆశించిన విధంగానే ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా అప్పులు ఇవ్వడం, తెచ్చుకోవడం మంచిది కాదు. రావాల్సిన ధనం సమయానికి అందడం కష్టం. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్‌లపై ఆధారపడ్డ వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది.

రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆశించిన పదవిని పొందడంలో ఆలస్యం జరుగుతుంది. నిరాశ చెందకుండా, ప్రజాజీవితంలో చురుగ్గా ఉంటూ, పైవారి మెప్పును పొందే ప్రయత్నం చేయాలి.

విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు బాగా శ్రమించాల్సిన కాలమిది. ర్యాంకుల కోసం వెంపర్లాడక, మెరుగైన పర్సెంటేజీని సాధించేందుకు కష్టపడాలి. విదేశీ విద్యా ప్రయత్నాల్లో నిరాశ తప్పేలా లేదు.

మేషరాశివారు, తరచూ శివాలయాన్ని సందర్శించడం మంచిది. ఏలినాటి శని కారణంగా, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకుంటే శుభ ఫలితాలుంటాయి. విష్ణు సహస్ర నామ పారాయణ కూడా మేలు చేస్తుంది.

***

వృషభం
ఆదాయం-11 వ్యయం-5
రాజపూజ్యత-1 అవమానం-3

వృషభ రాశివారికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలుంటాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో స్తబ్ధతలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పంతాలకు పోకుండా, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి, అడపాదడపా మానసిక ఆందోళనలు తలెత్తినా, ఎక్కువగా సంతోషకర వాతావరణమే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఆశించినట్లే జరుగుతాయి. మాతృవర్గీయులతో అనుకోని కష్ట, నష్టాలు, విరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీ ఉన్నతికి, ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనూహ్యంగా ఆశించని సహకారాలు లభిస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారాన్ని పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగులోని కార్యాలకు, సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. వారసత్వపు ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూలం. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఉన్నతాధికారుల గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులకు సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం బాగా కష్టపడాల్సి వుంటుంది. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పదోన్నతి మరియు ఆశించిన స్థానాలకు స్థానచలనం ఉంటుంది

వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యత ఉంటుంది. కులవృత్తి, ఇతర వృత్తి సంబంధ వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలుంటాయి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడుల కోసం అప్పులు చేయడం శ్రేయస్కరం కాదు. షేర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు.

రాజకీయ రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు కలిసివస్తాయి. అధినేతల మన్ననలను పొందుతారు. కీలక పదవులను పొందుతారు. అధికారిక హోదా పెరుగుతుంది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే గుణాన్ని అలవాటు చేసుకుంటే, మంచి పేరు ప్రతిష్టలను సొంతం చేసుకోగలుగుతారు.

విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల ఫలితాలుంటాయి. పోటీ పరీక్షల్లో నిర్దేశించుకున్న స్థాయి ర్యాంకులను సాధిస్తారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసివస్తాయి. బద్ధకం లేకుండా, పట్టుదలను వీడకుండా శ్రమించాలి.

వృషభరాశి వారు, మరిన్ని మెరుగైన ఫలితాలకు, పాపగ్రహ శాంతి నిమిత్తం, అనునిత్యం దత్తచరిత్ర పారాయణం, గణపతి, దుర్గాదేవిల ఆరాధన చేయడం మంచిది.

***

మిథునం
ఆదాయం-14; వ్యయం-2
రాజపూజ్యత-4; అవమానం-3

ఈ రాశివారికి ఈ సంవత్సరంలో గురుబలం అంతంత మాత్రంగానే ఉంది. అన్ని విధాలా జాగ్రత్తగా మెలగాల్సిన కాలమిది.ప్రతీ ప్రయత్నానికీ పట్టుదలను జోడించాల్సి ఉంటుంది. పనులు కాస్త ఆలస్యమైనా విజయం లభిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితమే దక్కుతుంది. నూతన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. సరికొత్త ఆలోచనలు, సంయమనంతో కార్యాలను సాధించుకుంటారు. బద్ధకించడం, పనులను వాయిదా వేయడం వల్ల ఏ ప్రయోజనమూ సిద్ధించదు. అపార్థాలు, మనస్పర్థలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా దాయాదులు, సోదరుల విషయాల్లో మితిమీరిన జోక్యం మంచిది కాదు. సాహసోపేతమైన స్వీయ నిర్ణయాలు ఉపకరిస్తాయి.

కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగానే సాగుతాయి. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలూ తొలగిపోతాయి. బంధు మిత్రుల సహకారంతో వివాహాది శుభకార్యాలను విజయవంతంగా నిర్వహిస్తారు. అదే సమయంలో ఆత్మీయులతో విరోధాలు పెరిగి మానసిక స్థిరత్వం దూరమయ్యే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్థిరాస్తులు మరియు వస్తు, వాహన ఆభరణాల కొనుగోలు యత్నాలు కొద్దిమేర అనుకూలిస్తాయి. తండ్రితో గానీ, తండ్రి తరపు బంధువులతో గానీ విరోధం ఏర్పడే సూచన ఉంది. యుక్తితో మెలగడం అవసరం. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. చేతివృత్తులు నిర్వహించేవారు లాభాలను పొందుతారు. వృత్తి సంబంధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి స్థిరత్వం ఏర్పడుతుంది. పరిచయాలు పెరిగి ఆర్థికంగా బలపడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఫలితాలు ఆశించిన విధంగానే ఉంటాయి. బదిలీలు, పదోన్నతుల ద్వారా లబ్ది చేకూరుతుంది. బాధ్యతల నిర్వహణలో మానసిక అశాంతి, ఒత్తిడి ఉన్నా, ఉన్నతాధికారుల ప్రశంసలు ఉత్తేజాన్నిస్తాయి. ప్రైవేటు రంగంలోని వారికి ప్రమోషన్లు ఆర్థిక వృద్ధితో కూడుకుని ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వంపై అనుకోని ఆందోళనలు నెలకొంటాయి. నిరుద్యోగులకు అతి కష్టమ్మీద అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించక పోవచ్చు.

వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలే ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారం కన్నా సొంత వ్యాపారమే అనుకూలిస్తుంది. తప్పనిసరై భాగస్వామ్య వ్యవహారాల్లో తలదూర్చాల్సి వస్తే, ప్రతీ విషయంలో స్వీయ పర్యవేక్షణ అవసరం.

రాజకీయ రంగంలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఊరిస్తోన్న పదవి దక్కే అవకాశం ఉంది. జనాదరణనూ పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు, షేర్లలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. తెలివితేటలను చూపకపోతే బాగా నష్టపోయే సూచన ఉంది.

విద్యార్థులకు శ్రమ అధికంగాను, ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఉత్తీర్ణత కోసం విశేషంగా శ్రమించాల్సి వుంటుంది. సోమరితనం, పనులు వాయిదా వేయడం పనికిరాదు. పరీక్షల్లో ర్యాంకుల కోసం పోటీ గట్టిగా ఉంటుంది.

మిథున రాశివారు ఈసంవత్సరం దుర్గాస్తోత్రం, నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం మంచిది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనం కూడా మేలు చేస్తాయి.

***

కర్కాటకం
ఆదాయం-8 వ్యయం-2
రాజపూజ్యత-7 అవమానం-3

గురు, శని బలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల వారూ, అన్నింటా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సామర్థ్యాన్ని చూపి అడ్డంకులను తొలగించుకుంటారు. చాలా కాలంగా తీరని సమస్యలు, తగాదాలు, ఆస్తి వ్యవహారాలు ఈ ఏడాది అనుకూలించే సూచనలున్నాయి. ఆర్థికంగా కాస్త మెరుగ్గానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ పట్టుదలతో పనిచేయాల్సి వుంటుంది. అనుకోని ఇబ్బందులు, చికాకుల వల్ల మనోస్థైర్యం తగ్గే సూచనలూ ఉన్నాయి. అయినా నిబ్బరాన్ని కోల్పోరాదు. ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు, వృథా ప్రయాణాలు వేదనకు గురి చేస్తాయి.

కుటుంబ అవసరాలను తీర్చేందుకు శ్రమిస్తారు. ఆర్థిక ఒడుదుడుకులను గట్టెక్కేందుకు కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మాట పడాల్సి వస్తుంది. గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి ఇబ్బంది పడతారు. భార్య తరఫు వారి ద్వారా సంతోషకరమైన వర్తమానం అందుతుంది. సంతానం పురోభివృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలుంటాయి. ముఖ్యంగా కడుపునకు సంబంధించిన అనారోగ్యాలపై తక్షణం వైద్యులను సంప్రదించడం మంచిది.

గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత.. అంటే అక్టోబర్ నెలలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతోషాన్ని కలిగించే శుభవార్తలను వింటారు. ఆ కాలంలో ప్రయత్నించిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ, ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. జరుగుతున్న పరిణామాలతో జీవితంపై ఆశ, ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మానసిక ఒత్తిడి, అనుకోని ఆందోళన బాధిస్తాయి. ఆశించిన ఇంక్రిమెంట్లు, కోరుకున్న చోటికి బదిలీలు లభించే అవకాశం తక్కువగా ఉంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగాలి. తొందరపాటు, నోటి దురుసు కారణంగా, ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ప్రభుత్వ రంగంలోని వారికి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. వీరు పై అధికారుల గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులు విపరీతమైన శ్రమానంతరమే తగిన ఫలితాలను పొందుతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి.

వ్యాపార రంగంలోని వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆశించిన లాభాలు ఉన్నప్పటికీ, పోటీ తీవ్రంగా ఉండి, మానసిక ఒత్తిడి అధికమవుతుంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేసే వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా చక్కటి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి అనుకూలంగా ఉన్నట్లే కనిపించినా, అదృష్ట భంగం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపార విస్తరణ ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. రియల్టర్లు, స్టాక్ మార్కెట్ వర్గాలు ఆచితూచి వ్యవహరించాలి.

రాజకీయ రంగాల్లోని వారికి మధ్యమ ఫలితాలుంటాయి. ప్రజాజీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. గతంలో చేసిన పనులు, ప్రస్తుత స్వయంకృతాపరాధం వల్ల అవమానాలకు గురయ్యే వీలుంది. పదవులు ఆశించే వారికి నిరాశ తప్పదు. బాధ్యతల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.

విద్యార్థులు, రెగ్యులర్ పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయం కోసం విశేషంగా శ్రమించాల్సి ఉంటుంది. ర్యాంకుల సాధన అంత సులువైన సంగతేమీ కాదని అర్థమవుతుంది. అనునిత్యం క్రమశిక్షణతో, చక్కటి ప్రణాళికలతో చదివినప్పుడే, కోరుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఏకాగ్రత దెబ్బతినే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. విదేశీ విద్యా ప్రయత్నాలకు అంత అనుకూలంగా లేదు.

ఈ రాశివారు నిత్యం దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. తరచూ నవగ్రహ శాంతిని చేయించుకోవడం వల్ల గోచార గ్రహ దోషాలు తొలగిపోయే వీలుంది.

***

సింహం
ఆదాయం-11; వ్యయం-11
రాజపూజ్యత-3; అవమానం-6

సింహరాశి జాతకులపై అష్టమ శని ప్రభావం ఉంది. గురుడు కూడా సామాన్య ఫలదాత. కాబట్టి, ప్రతి పనినీ ఇష్టపూర్వకంగా చేపట్టాల్సి ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారన్న భ్రమలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు మాత్రం తృప్తిగానే సాగుతాయి. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఒడుదుడుకులు ఉంటాయి. మానసిక దృఢత్వాన్ని కోల్పోకుండా శ్రమిస్తే, నిలదొక్కుకోగలుగుతారు. ఆయా గ్రహాల స్థితి, గతుల కారణంగా, మనసు నిలకడగా ఉండదు. అనవసరంగా ఆందోళనలు కలుగుతుంటాయి.

శని గోచారస్థితి కారణంగా, పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో తరచూ చికాకులు ఏర్పడుతుంటాయి. సంయమనంతో అన్నింటినీ సరిదిద్దాల్సి ఉంటుంది. వివాహాది శుభ కార్యాలు ఆశించినట్లుగానే జరుగుతాయి. గృహ నిర్మాణం, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలపై దృష్టి పెడతారు. తాహతుకు మించి రుణం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. వాహనయోగం ఉంది. ఆరోగ్య విషయంగా అనుకోని ఖర్చులు వస్తాయి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి, ఈ సంవత్సరం విశేషమైన మార్పులేమీ ఉండవు. పైగా అనూహ్యమైన భయాందోళనలు వెంటాడతాయి. ఇష్టంలేని ప్రాంతానికి లేదా విభాగానికి బదిలీ అయ్యే సూచన ఉంది. ఆర్థికంగా సంతోషకరంగా ఉన్నా, పని చేస్తున్న ప్రదేశం నచ్చక ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన విధంగానే బదిలీలు, ప్రమోషన్లు కలిసివస్తాయి. ఉన్నతాధికారులో సఖ్యత చెడుతుంది. ఫలితంగా పని చేసే చోట ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. విదేశీ ఉద్యోగాల్లో ఆటంకాలు విపరీతంగా ఉంటాయి. అయితే, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలకు అక్కడి మిత్రులు సహకరిస్తారు. అయినా, ఈ ప్రయత్నాలు ఎంతో ఎదురు చూపు తర్వాతే ఫలిస్తాయి.

వ్యాపారులకు ఆశించిన విధంగానే లాభాలుంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, ప్రస్తుత వ్యాపార విస్తరణకు అనుకూల కాలం కాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తప్పనిసరైన ఖర్చుల కారణంగా, అనుకోని ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. డబ్బుని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడాలి. అప్పులు చేయక తప్పని పరిస్థితి గోచరిస్తోంది. చేతి వృత్తులు అవలంబించే వారికి పనులు బాగానే ఉన్నా.. ఆశించినంత మిగులు ఉండదు. కులవృత్తులను ఆచరించే వారికి విశేష లాభముంటుంది. స్పెక్యులేషన్స్ అనుకూలించవు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లోని వారికి సామాన్య ఫలితాలుంటాయి.

రాజకీయ రంగాల్లోని వారు, అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత స్థాయి వారి నుంచి ఆశించిన సహకారం లభించదు. రాజకీయాలపై విరక్తి కలిగే సూచనలూ ఉన్నాయి. ప్రజాజీవితంలో ఆటుపోట్లను సహనంతో ఎదుర్కొంటేనే చక్కటి భవిష్యత్తు అని గుర్తించి కష్టపడాలి. లక్ష్యాలను చేరుకునే మార్గాలను అనుసరించాలి.

విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అయితే దీనికి విశేష శ్రమ అవసరం. ఈ ఏడాది సింహరాశి విద్యార్థుల్లో మతిమరపు అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఆశించిన స్థాయి ఫలితాలను పొందలేరు. సాధారణ పరీక్షల్లో కొద్దిపాటి శ్రద్ధ చూపితే, ముందంజలో ఉంటారు. బద్ధకం, నిర్లక్ష్యం కారణంగా, ఎన్నో మంచి అవకాశాలను కోల్పోతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి.

ఈరాశి వారు నిత్యం గణపతి స్తోత్ర పఠనం, హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా మానసిక శాంతిని పొందగలుగుతారు. అష్టమ శని స్థితి వల్ల తలెత్తే చికాకులు తొలగించుకునేందుకు, తరచూ.. నువ్వుల నూనెతో శనైశ్చరుడిని అభిషేకించడం మంచిది.

***

కన్య
ఆదాయం-14; వ్యయం-2
రాజపూజ్యత-6; అవమానం-6

ఈరాశి వారికి విశ్వావసు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలే అందుతాయి. ప్రతి పనినీ పట్టుదలతో సాధించుకోవాలి. ఆరోగ్య సమస్యలు, ఊహించని ఖర్చులు వంటివి తరచూ ఎదురవుతాయి. గృహమార్పు, ప్రాంత మార్పు వంటివి కొందరికి తప్పేలా లేవు. ప్రతి విషయంలోనూ కొత్త కోణాలను అన్వేషిస్తూ, లక్ష్య సాధనవైపు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వారసత్వపు ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వచ్చే వీలుంది. అనవసర పంతాలు, పట్టుదలలకు పోయి ఇరుకున పడే సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వ్దదు. అనవసరమైన ఖర్చులు, తప్పనిసరి ప్రయాణాలు ఉంటాయి. తల్లిదండ్రుల వైపు బంధువులతో సఖ్యత చెడుతుంది. మానసిక అశాంతి పెరుగుతుంది.

ఆర్థికంగా మిగులు లేకున్నా, రొటేషన్ మాత్రం బాగానే ఉంటుంది. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం వల్ల చిక్కుల్లో పడతారు. పొరపాటున కూడా ఎవరికీ పూచీగా ఉండకండి. దీని వల్ల ఊహించని ఇబ్బందులు వస్తాయి. నమ్మినవారి చేతిలోనే మోసపోతారు. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ప్రతి పనిలోనూ స్వీయ పర్యవేక్షణ అవసరం. అన్నదమ్ములు, దాయాదులతో అనుకోని ఘటనలు, మనస్పర్థలు ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగే వీలుంది. కాబట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నోటిదురుసుతో వ్యవహరించడం మంచిది కాదు. స్నేహితులతో కూడా హద్దుల్లో ఉండడం శ్రేయస్కరం.

వివాహాది శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. బంధువులు సహకరిస్తారు. స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచన ఉంది. వస్తు, వాహన లాభముంది.
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ప్రధానంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి కాస్తంత ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారికి ఆశించిన రీతిలోనే ప్రమోషన్లు లభిస్తాయి. అయితే మానసిక ఆందోళన, పని ఒత్తిడి బాగా పెరుగుతాయి. ప్రభుత్వోద్యుగులకు సామాన్య అనుకూలతలుంటాయి. బదిలీలు, ప్రమోషన్లు, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యం గోచరిస్తోంది. ఉన్నతాధికారులతో అనూహ్యమైన స్పర్థలు ఏర్పడే సూచనలున్నాయి. విదేశీ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి.

వ్యాపారులు, భాగస్వామ్య వ్యవహారాలకు తగినంత దూరంగా ఉండడం మంచిది. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాలు అనుకూలించడం బాగా కష్టం. సొంతంగా వ్యాపారాలు నడిపే వారికి, రాబడి ఉన్నా, మిగులు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేసే వారికి, కులవృత్తులను కొనసాగించే వారికి లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్ నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. రియల్టర్లు, స్పెక్యులేటర్లు, షేర్ మార్కెట్ రంగాలకు చెందిన వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకుంటే, భారీగా నష్టపోయే సూచన ఉంది.

రాజకీయ రంగాల్లోని వారికి కాస్తంత గడ్డు కాలమనే చెప్పాలి. ఇంటా, బయటా గౌరవ భంగాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని పంతాలకు పోతే కెరీర్ పరంగా కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉంది. అనవసరమైన చోట తగ్గుతూ.. అవసరమైన చోట చక్కటి ఎత్తులు వేసుకుంటే వెళితే, కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం బాగా శ్రమించాల్సి వుంటుంది. ప్రణాళికల అమలులో అలసత్వం, వాయిదాలు వేయడం వల్ల ఆశించిన ర్యాంకులు లభించే అవకాశాలు ఉండవు. విదేశీ విద్యాప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది.

ఈరాశి వారు నిత్యం శివుణ్ణి దర్శిస్తూ, అర్చన, అభిషేకాలు చేయించడం వల్ల మేలు జరుగుతుంది. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది. మధ్యమధ్యలో నవగ్రహారాధనలూ చేయించుకోవడం శుభఫలితాలనిస్తుంది.

***

తుల
ఆదాయం-11; వ్యయం-5
రాజపూజ్యత-2; అవమానం-2

ఈ రాశి వారికి ప్రధాన గ్రహాల అనుకూలతలు సామాన్యంగానే ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఒకట్రెండు నెలలు మామూలుగా సాగుతుంది. ఆ తర్వాత, కొన్ని ఆటంకాలు వచ్చినా, సమయస్ఫూర్తి, పట్టుదలలు ప్రదర్శించి, పనులను పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ ఇదే రీతిగా ఉంటుంది. వీలైనంత మేర ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం మంచిది కాదు. అదృష్టం పడుతుందనో, ఎవరో సహకరిస్తారనో ఆశలు పెట్టుకోవడం, ఊహాగానాల్లో విహరించడం మానుకోవాలి. అతి విశ్వాసం అసలే పనికిరాదు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

కుటుంబ వ్యవహారాలు మీరు భావించినట్లే సజావుగా సాగుతాయి. సంతానం అభివృద్ధిలోకి రావడం సంతోషాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థితిని సమతుల్యం చేసుకుంటారు. వివాహాది శుభ కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం అనుకూలిస్తుంది. గృహ నిర్మాణానికి అవసరమైన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. వాహనయోగం ఉంది. మీ పురోభివృద్ధికి.. బంధువులు, రక్త సంబంధీకుల కన్నా, మిత్రులే ఎక్కువగా సహకరిస్తారు. రుణ విముక్తి ప్రయత్నాలూ సఫలమవుతాయి. గౌరవం లభిస్తుంది.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఆర్థికవృద్ధి ఆశించిన రీతిలోనే ఉంటుంది. ప్రైవేటు రంగంలో పనిచేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మానసిక ఆందోళనలు తలెత్తినా, తట్టుకుని నిలుస్తారు. తోటి ఉద్యోగులతో తరచూ భేదాభిప్రాయాలు, కలహాలు సూచిస్తున్నాయి. వీలైనమేర వీటిని పరిష్కరించుకోండి. ఇక, ప్రభుత్వోద్యోగులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలకు జాప్యం అనివార్యంగా కనిపిస్తోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, అక్కడి మిత్రుల సహకారంతో కలిసి వస్తాయి. స్థూలంగా, ప్రైవేటు రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యాపారులకు ఈ సంవత్సరం సాధారణ లాభాలే ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన సానుకూలతలు కనిపించడం లేదు. కొత్త పెట్టుబడులు లేదా విస్తరణ ప్రయత్నాల కోసం, శక్తి మించి రుణాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన వ్యాపారాలు, చేతివృత్తులను నమ్మి వ్యాపారం చేసేవారికి, రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలకూ, కొత్త కాంట్రాక్టులను తీసుకోవడానికి కూడా అనువుగా లేదు. రియల్టర్లు, షేర్ మార్కెట్‌లలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

రాజకీయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికే పదవుల్లో కొనసాగుతున్న వారు, మరింత మెరుగైన పదవిని పొందుతారు. ప్రజాక్షేత్రంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత, మీ ప్రాంత సమస్యల పరిష్కారానికి చేసే కృషి ఫలిస్తుంది.

విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం అధ్యయనం చేస్తే, నిర్దేశించుకున్న ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు అనువుగా ఉంది. దూర విద్య, విదేశీ విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి.

ఈరాశి వారు నిత్యం దుర్గామాత అష్టోత్తరాన్ని పఠించడం, లేదా అమ్మవారి నామాన్ని స్మరించడం మంచిది. వేంకటేశ్వరస్వామి దర్శనం, గోవిందనామాల స్మరణ కూడా మేలు చేస్తాయి.

***

వృశ్చికం
ఆదాయం-2; వ్యయం-14
రాజపూజ్యత-5; అవమానం-2

ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికీ సామాన్యంగానే ఉంటుంది. ఆలస్యంగా అయినా, ఆశించిన ఫలితాలు మాత్రం దక్కుతాయి. గత సంవత్సరం కంటే కొంత ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రయత్నాలను సఫలం చేసుకునేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపడి మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మొండి పట్టుదలకు పోవడం వల్ల నష్టపోతారు. అవసరానికి తగ్గట్లుగా పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఈ సంవత్సరం, ఈరాశి జాతకులను, ఎదుటి వారు అపార్థం చేసుకునే సందర్భాలు బాగా ఎక్కువగా ఉంటాయి.

ఆర్థిక వ్యవహారాలు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగానే సాగుతాయి. అవసరానికి తగిన డబ్బు సర్దుబాటు అవుతుంటుంది. ఖర్చు విషయంలో ప్రణాళిక లేకపోతే, మొదటికే మోసం వచ్చే వీలుంది. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మితిమీరిన అప్పులు కూడా మంచిది కాదు. పంతం కారణంగానో, ఆత్మీయుడని భావించో.. ఎవరికీ పూచీలను ఇవ్వకండి. వారి రుణభారం మీరు మోయాల్సి వస్తుంది. కుటుంబంలో అనవసరమైన ఆందోళన తలెత్తుతుంది. జీవిత భాగస్వామి తరఫు వారితోను, తల్లి తరపు బంధువులతోను సంయమంనంతో వ్యవహరించాలి. వివాహాది శుభకార్యాల పూర్తికి బాగా ఇబ్బంది పడతారు. నమ్మిన వ్యక్తులు అత్యవసర సమయంలో ముఖం చాటేయడం వల్ల సమస్యలొస్తాయి. భూ, వస్తు, వాహనాదుల కొనుగోలు యత్నాలు బాగా నెమ్మదిస్తాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిళ్లుంటాయి. బాధ్యతల నిర్వహణలో అలసత్వం, బద్ధకం కారణంగా ఉన్నతాధికారులతో మాట పడాల్సి వస్తుంది. పైఅధికారుల వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగ స్థిరత్వంపై భయాందోళనలు కలుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వారికి ఆశించిన బదిలీలు, ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు అంత తేలిగ్గా లభించవు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకై ప్రయత్నించకుండా బాధ్యతగా సాగడమే మంచిది. విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలూ ఏమంత ఆశాజనకంగా ఉండవు.

వ్యాపారులకు సామాన్య ఫలాలే ఉంటాయి. వ్యాపారం తగ్గుముఖం పట్టి, ఆశించిన స్థాయి లాభాలు లభించక ఆందోళనకు గురవుతారు. వ్యాపార విస్తరణకు కొన్ని అడ్డంకులు ఎదురైనా, అతి కష్టమ్మీద గట్టెక్కుతారు. వీలైనంత వరకు, కొత్త వ్యాపారాల ప్రారంభం, వ్యాపార విస్తరణ యత్నాలను విరమించుకుంటే మంచిది. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తులపై ఆధారపడిన వ్యాపారాలు చేసేవారికి ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. అయితే, సమాయానికి వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో వెనుకబడడం వల్ల ఇబ్బంది పడతారు.

రాజకీయ రంగంలోని వారు విపరీతమైన ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు బలంగా తయారవుతారు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతారు. ఎన్నికలు, పోటీల్లో తొందరపాటు మంచిది కాదు. మెరుగైన అవకాశం వచ్చే వరకూ ఓపికగా ఉండాలి.

విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలి. పోటీ పరీక్షలపై దృష్టిని సారించి, ఏకాగ్రతతో చదివినా ఆశించిన స్థాయి ఫలితాలు అందవు. నిర్లక్ష్యంగా, బద్ధకంతో వ్యవహరిస్తే, అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల దిశానిర్దేశంలో అనుకూల దృక్పథంతో సాగితే, కాస్త మెరుగైన ఫలితాలను పొందుతారు. విదేశీ విద్యాయత్నాలను విరమించుకుంటే మంచిది.

ఈరాశి వారు గురువులు, అవధూతలను ఆరాధించడం, విష్ణు సంబంధ క్షేత్రాలను దర్శించడం వల్ల మేలు కలుగుతుంది. అడపాదడపా శివుడికి అభిషేకం, రుద్రకవచ పారాయణ వల్ల కూడా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు.

***

ధనుస్సు
ఆదాయం-5; వ్యయం-5
రాజపూజ్యత-1; అవమానం-5

విశ్వావసు సంవత్సరంలో.. ధనూరాశికి చెందిన అన్ని రంగాల వారికీ సాధారణ ఫలితాలే ఉంటాయి. ఏప్రిల్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రతికూలతలు ఎక్కువగా అనిపిస్తాయి. మిగిలిన నెలల్లో పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. అనుకోని ఆటంకాల వల్ల పనులు ఆలస్యమైనా, అంతిమంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనినీ స్వీయ పర్యవేక్షణలోనే కొనసాగించండి. ఇతరులపై ఆధారపడడం వల్ల కష్టనష్టాలు ఎదురవుతాయి. సోదరులు, స్నేహితులు, బంధువర్గాల వ్యవహారాల్లో వీలైనంత వరకు జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. అతిగా నమ్మడం, అస్సలు నమ్మకపోవడంలా కాకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది.

ఆర్థికంగా బలపడతారు. పొదుపు చర్యలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని అప్పులను తీర్చగలుగుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి, వస్తు, వాహనాలను కొనుగోలు చేసే యోగం ఉంది. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని గుర్తించండి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తక్షణ స్పందన వల్ల సమస్య నుంచి గట్టెక్కుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈ రాశివారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనా, దాని ప్రభావం పెద్దగా బాధించదు.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆశాజనకంగా ఉన్నా, ఆర్థిక పురోగతి మందస్థాయిలో ఉంటుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, తరచూ పైఅధికారులతో మాట పడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి. ఉద్యోగ స్థిరత్వంపై నిరంతరం భయాలు వెంటాడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త మెరుగ్గా ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు కొద్దిపాటి ఆలస్యంగా అయినా, ఆశించిన రీతిలోనే ఉంటాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు.

వ్యాపారులకు శుభ ఫలితాలుంటాయి. ఆశించిన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన సమయం కాదు. భవిష్యత్తుపై ఆశతో.. ఉన్నదానితో సంతృప్తి చెందడం మంచిది. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తుల ఆధారిత వ్యాపారాలు చేసే వారికి సంతోషకరంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగానూ అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లలోని వారికి మధ్యస్థ ఫలితాలే ఉంటాయి.

రాజకీయ రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. ఆశించిన పదవులు, హోదాలు దక్కినట్లే దక్కి చేజారే సూచనలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో అవమానాలు ఎదురు కాకుండా ప్రణాళికాబద్ధంగా నడచుకోవాలి.

విద్యార్థులు ఆశించిన ఫలితం సాధించడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. అడుగడుగునా విఘ్నాలు వస్తుంటాయి. మనోధైర్యంతో, ప్రణాళికాబద్ధంగా అధ్యయనం సాగించాలి. పోటీ పరీక్షల్లో ర్యాంకులను ఆశించేవారు రెట్టింపు కష్టపడాలి. విదేశీ విద్యాప్రయత్నాలు అనుకున్నంత తేలిగ్గా నెరవేరవు.

ఈ రాశివారు ఆంజనేయ స్వామికి నిత్యపూజలు, శ్రీరామరక్షాస్తోత్ర పారాయణ చేయడం మేలు చేస్తుంది. తరచూ కాలభైరవ స్వామి ఆరాధన, కాలభైరవాష్టక పఠనం వల్ల కూడా మరింత శుభం జరుగుతుంది.

***

మకరం
ఆదాయం-8; వ్యయం-14
రాజపూజ్యత-4; అవమానం-5

గ్రహాల స్థితి గతుల రీత్యా.. మకర రాశివారికి ఈ సంవత్సరం కూడా దాదాపుగా గత ఏడాది మాదిరిగానే, సాధారణ అనుకూలతలతో సాగుతుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ, కొన్ని ఒడుదుడుకులు ఎదురైనా, చివరికి విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరిలోనూ సానుకూల దృక్పథం పెరుగుతుంది. సంతానం స్థిరత్వాన్ని సాధిస్తుంది. మీ విషయంలో శత్రువులు చేసే కుట్రలు కూడా మీకే అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కలిసివస్తాయి. గృహ, భూ, వస్తు, వాహన లాభాలుంటాయి.

ఆర్థిక పరిస్థితులు కాస్తంత మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వీరి కారణంగా అభివృద్ధి, ధనలాభం గోచరిస్తున్నాయి. తరచూ విందు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలు చేస్తారు. ప్రతి పనినీ రెట్టించిన ఉత్సాహంతో చేసే స్వభావం కారణంగా, సత్ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా వేధిస్తోన్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దైవకార్యాల్లో నిమగ్నమవుతారు. డబ్బు వృథా కాకుండా సద్వినియోగం చేస్తారు. కుటుంబ అవసరాల కోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీలైనంత వరకు నోటిదురుసును తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారు తగినంత ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. ఆశించిన ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆశించిన రీతిలోనే బదిలీలు, ప్రమోషన్లు అందుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపునూ పొందుతారు. తగిన పురస్కారాలను అందుకుంటారు. విదేశాల్లో ఉంటూ ఉద్యోగ స్థిరత్వం కోసం ప్రయత్నించే వారికి ఆశించిన ఫలితం లభిస్తుంది.

వ్యాపారులు ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను పొందుతారు. పోటీదారుల కన్నా ముందంజగా ఉంటారు. వ్యాపారాలు సజావుగా సాగడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తి ఆధారంగా చేసే వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. అనూహ్యమైన ప్రోత్సాహం, ఆకస్మిక ధనయోగం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణలకు, కొత్తగా అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలతో ముడిపడిన వ్యాపారాలూ వృద్ధి చెందుతాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లకు చెందిన పెట్టుబడిదారులకు ఆశించినదానికన్నా మెరుగైన లాభం ఉంటుంది. వీరు లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

రాజకీయ రంగాల వారికి చాలా మేలిమి ఫలితాలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల ఆశీస్సులు పుష్కలంగా దక్కుతాయి. ఆశించిన పదవులను అందుకోగలుగుతారు. ప్రజాజీవనంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మాటపలుకుబడి బాగా పెరుగుతుంది. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి.

విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఘనవిజయం సాధించి ఆశించిన ర్యాంకులను కైవసం చేసుకుంటారు. ఒక్కోసారి అతి విశ్వాసంతో వెనుకబడే సూచనలున్నాయి. విదేశీ విద్యాయత్నాలు అనుకూలిస్తాయి.

ఈరాశి వారు, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఆరాధించడం, కేశవ నామాలు స్మరించడం మంచిది. దుర్గా సప్తశతి, అడపాదడపా రాహుగ్రహ శాంతి దానాలు చేయిస్తే చిన్నపాటి దోషాలూ తొలగిపోతాయి.

***

కుంభం
ఆదాయం-8; వ్యయం-14
రాజపూజ్యత-7; అవమానం-5

గోచార గ్రహాల స్థితి, గతుల రీత్యా, ఓమోస్తరులో శుభ ఫలితాలే లభిస్తాయి. అన్ని వ్యవహారాల్లోనూ స్థిరచిత్తం, సానుకూల దృక్పథంతో సాగాలి. ప్రతి పనినీ పలు రకాలుగా ఆలోచించి ప్రయత్నించాలి. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక అవసరాలకు అప్పులూ చేయాల్సి రావచ్చు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అన్నింటా ముందుచూపు చాలా అవసరం. ఈ రాశివారికి కార్యసాధనలో.. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి కార్యంలోనూ ఆత్మవిశ్వాసం అవసరం. అలాగని, అతివిశ్వాసం, దురాలోచన ఏమాత్రం మంచిది కాదు. వస్తు, వాహన, గృహ భూమి లాభాలుంటాయి. వివాహాది శుభకార్యాలు నెరవేరతాయి.

జీవిత భాగస్వామితో అనుకోని కలహాలు ఎదురైనా, సంసార జీవితంపై ఏమంత ప్రభావం చూపవు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. సత్సంబంధాలు నెలకొంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు విహారయాత్రలు చేస్తారు. నూతన పరిచయాలు కలతలకు కారణమయ్యే సూచన ఉంది. ఈ రాశివారు, మాట నిలుపుకోలేక అవమానపడే వీలుంది. కాబట్టి, వీలైనంత వరకు ఎవరికీ పూచీగా ఉండకండి. ప్రాణ స్నేహితులే అయినా, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వద్దు. ఆరోగ్యంపై తగిన జాగ్రత్త అవసరం.

వృత్తి, ఉద్యోగ, జీవనోపాధి వ్యవహారాల్లో తొందరపాటు ఏమాత్రం మంచిది కాదు. ఒత్తిడి, భయాందోళనలు, వ్యతిరేక మనోభావాలు, నిరాశ, నిస్పృహ ఏర్పడినా.. స్థిర చిత్తంతో పనిచేస్తే.. సత్ఫలితాలే లభిస్తాయి. చేతివృత్తులు, కులవృత్తులను కొనసాగించే వారికి కాస్తంత అనుకూలంగానే ఉన్నా, బద్ధకం, నిర్లక్ష్య ధోరణి కారణంగా చక్కటి అవకాశాలను దూరం చేసుకుంటారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కాస్త మెరుగ్గా ఉంటుంది. ఆశించిన రివార్డులు, అనుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి. అయితే, వ్యర్థ మాటల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పై అధికారులతో అనుకూలంగా లేకుంటే అనుకోని చక్కుల్లో పడేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు ఆశాజనంగానే ఉంటాయి.

వ్యాపారులు ఈ ఏడాది లాభాలను అందుకుంటారు. వీలైనంత మేర భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఇప్పటికే భాగస్వామ్య వ్యాపారాలు నడిపేవారు, పరిధిని దాటకండి. చెప్పుడు మాటలతో మనసును విరిచి, లబ్ది పొందాలనుకునేవారు ఎక్కువగా ఉంటారు. తెలివిగా వ్యవహరించండి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార యత్నాలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పనిసరై వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చినా, సామర్థ్యాన్ని మించి పెట్టుబడి పెట్టకండి. ముఖ్యంగా అప్పు చేసి వ్యాపారం ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ఎగుమతి, దిగుమతుల వ్యవహారాల్లో చిక్కులుంటాయి.

రాజకీయ రంగంలోని వారు ఓపికగా వ్యవహరించాలి. దుందుడుకు చర్యల వల్ల చిక్కుల్లో పడతారు. ఆశించిన పదవి లభించినా, దాన్ని సమర్థంగా నిర్వహించడంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆశించిన స్థాయిలో కాకున్నా, ఓమోస్తరు లాభాలను చూస్తారు.

విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. లక్ష్యసాధనకు బాగా ఎక్కువగా కష్టపడాలి. ర్యాంకులపై ఆశ ఉన్నా, దానికి తగ్గ కృషి లేకపోవడం వల్ల నిరాశ తప్పదు. విదేశీ విద్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దళారుల వల్ల మోసపోయే సూచన ఉంది. నిరుద్యోగులు విసుగు చెందకుండా అవకాశం చిన్నదైనా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి వారు, ఈ సంవత్సరమంతా.. నిత్యం శివనామస్మరణ చేయడం, శివాలయాన్ని దర్శించడం మంచిది. దుర్గా సప్తశతి పారాయణం, రుద్రాభిభిషేకం మేలు చేస్తాయి. నవగ్రహారాధన శుభ ఫలితాలనిస్తుంది.

మీనం
ఆదాయం-5; వ్యయం-5
రాజపూజ్యత-3; అవమానం-1

ప్రధానమైన గ్రహాల అనుకూలత వల్ల.. ప్రయత్నాల్లో మంచి ఫలితాలనే పొందుతారు. కార్యసాధనలో తోడుగా నిలిచేవారూ ఎక్కువగానే ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉన్నా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్ని నింపుతుంటాయి. సమస్యలను దీటుగా ఎదుర్కొనే సహనం అలవాటవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో.. దళారుల కారణంగా మోసపోయే సూచన ఉంది. నిరుద్యోగులు, అవివాహితులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు దక్కుతాయి. సంతానం పురోగతి ఆనందాన్ని పెంచుతుంది. అనూహ్యమైన ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. కార్యాల్లో విఘ్నాలు తలెత్తినా, సమయస్ఫూర్తితో దాటేస్తారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. కొత్త పరిచయాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. కార్యసాధనలో వాయిదా పద్ధతి మంచిది కాదు.

గడచిన కాలం కంటే.. ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను సామరస్యంగా నిర్వహిస్తే, శాంతి సౌభాగ్యాలు పెరుగుతాయి. వస్తు, వాహనాలను కొంటారు. సామాజిక గౌరవం వృద్ధి చెందుతుంది. పాత అప్పులను తిరిగి చెల్లించే పరిస్థితులూ గోచరిస్తున్నాయి. వివాహాది శుభ కార్యాలకు బంధుమిత్రులు సహకరిస్తారు. ఈ రాశివారు ఏపనికైనా, ఇతరులపై ఆధారపడకుండా, స్వయంకృషిని నమ్ముకోవడం మేలు. అవసరానికి మించిన అప్పులు చేయకండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. సాధ్యమైనంత మేర, వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి సాధారణ ఫలితాలుంటాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారికి ఆశాజనంగా ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. పైఅధికారులు, పెద్దల ప్రశంసలను పొందుతారు. ప్రభుత్వ రంగంలోని వారికి ఒడుదుడుకులుంటాయి. ప్రమోషన్లు బదిలీల వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ఉద్యోగ స్థిరత్వంలోనూ ఆలస్యముంటుంది.

వ్యాపారాభివృద్ధి కోసం చేసే రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాలి. వీలైతే ఈ సంవత్సరం వ్యాపార ఆరంభ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్, స్పెక్యులేషన్స్ వ్యవహారాలు మధ్యమ ఫలితాలనే సూచిస్తున్నాయి.

రాజకీయ రంగంలోని వారికి వృద్ధి క్షయాలు సమంగానే ఉంటాయి. ఆశించిన పదవులు ఊరించి ఉస్సురనిపిస్తాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, రహస్యాలు బట్టబయలు కాకుండా అతి జాగ్రత్తగా నడచుకోవాలి

విద్యార్థులకు సాధారణ ఫలితాలే ఉంటాయి. బాగా శ్రమిస్తేనే గాని లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆశించిన ర్యాలకులను సాధించకున్నా, ఫలితాలు కాస్తంత మెరుగ్గానే ఉంటాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కొద్దిపాటి ఆలస్యమైనా, సత్ఫలితాలు లభిస్తాయి.

మీనరాశి వారు ఈ సంవత్సరం, నిత్యం శివకవచము, అర్ధనారీశ్వర స్తవమును పారాయణ చేయడం మేలు. దుర్గారాధన, వీలున్నప్పుడల్లా దుర్గా సప్తశతి పారాయణం శుభ ఫలితాలనిస్తుంది. ఏలినాటి శని దోష నివారణ కోసం శనికి నువ్వుల నూనెతో అభిషేకం, రాహు గ్రహ శాంతికి మినుములు, నూనె వంటి దానాలు మంచిది.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్