Saturday, January 18, 2025
HomeTrending Newsపల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి - ఎర్రబెల్లి

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి – ఎర్రబెల్లి

రాష్ట్రంలో పల్లెలు ప్రగతి పథంలో ఉన్నాయని, నిరంతర పారిశుధ్యంతో ఆహ్లాద కరంగా మారి ఆరోగ్యకరంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంటే, నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అని చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధి హామీ నిధుల్లో రాష్ట్ర వాటా మన హక్కు, దేశంలోనే అత్యధికంగా నిధులు వినియోగించుకుంటూ కూలీలకు 15 కోట్ల పని దినాలను కల్పించి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని మంత్రి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ప్రధాని మోదీ కి చెందిన గుజరాత్ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని, సభ్యులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ 2వ శాసన సభ, 8వ సమావేశాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బాల్క సుమన్, పట్నం నరేందర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, మాధవనేని రఘునందన్ రావు తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 12 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఒక వైకుంఠధామం ఉండేలా ప్రభుత్వం పనులను చేపట్టింది. 2 బర్నింగ్ ప్లాట్ ఫాంలు, ఆఫీస్, స్టోర్ రూము, మగవారికి,ఆడవారికి వేర్వేరు టాయిలెట్లు, ఎలక్ట్రిసిటి, నీటి సౌలభ్యం ఉండేలా 12 వేల 769 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల పనులను చేపట్టామన్నారు. 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గానూ 12 వేల 622 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 147 వైకుంఠధామాల పనులు వేర్వేరు స్టేజ్ లలో నడుస్తున్నాయి. వాటిని కూడా ఈ అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం అన్నారు. వీటి కొరకు ఇప్పటివరకు 1 వెయ్యి 547 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అన్నారు.

పల్లె ప్రగతి ప్రోగ్రాంలో భాగంగానే ప్రభుత్వం వ్యర్థ పదార్థాల నిర్వహణను నిర్వహిచండానికి ప్రతి గ్రామానికి 2 లక్షల 30 వేల వ్యయంతో ఒక డంపింగ్ యార్డు చేపట్టాలని నిర్ణయించడమయినది. పొడి చెత్తను రిసైక్లింగ్ చేయడానికి 6 బుట్టలు, ఒక వేర్పాటు షెడ్డుతో పాటు డ్రైయింగ్ ప్లాట్ ఫాం, 2 కంపోస్టు చాంబర్లు, 1 స్టోర్ రూము, 1 ఇంకుడుగుంత, టాయిలెట్ ఉండేలా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు పనులు చేపట్టడం జరిగింది అన్నారు. 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గానూ 12 వేల 737 గ్రామ పంచాయతీలలో గ్రామీణ డంపింగ్ యార్డు పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 32 పనులను ఈ అక్టోబర్ 2021 చివరి నాటికి పూర్తి చేస్తాం. వీటి కోసం ఇప్పటివరకు 319 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్