Sunday, November 24, 2024
HomeTrending NewsCotton Seed: పత్తి విత్తనాల కొరతపై మంత్రి ఆగ్రహం

Cotton Seed: పత్తి విత్తనాల కొరతపై మంత్రి ఆగ్రహం

పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్‌ విత్తనాలు అని.. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒక్కటే రకమైనవేనని తెలిపారు. ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసే ఈ విత్తనాల 400 గ్రాముల ప్యాకెట్‌ ధరను కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.450గా నిర్ణయించిందని పేర్కొన్నారు. పత్తి విత్తనాల ధరను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ వాటి నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. అటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వాళ్ల లైసెన్స్‌లు రద్దు చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. విత్తనాలు దొరకవేమో అని రైతులు కంగారు పడొద్దని.. అవసరమైన దానికంటే అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారని.. అంటే 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. అయితే మార్కెట్‌లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్