ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడంలో జాప్యం సమస్యను త్వరలోనే తీరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ‘‘ డబ్బులు ఉంటే .. జీతాలు ఇయ్యకుండా ఉంటామా ?’’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు 40వేల కోట్ల రూపాయల బడ్జెట్ రావల్సి ఉండగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. ఈ విధంగా ఇబ్బందులు రావడం వల్ల జీతాలు ఇవ్వలేకపోయామని వివరించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో హరీశ్ రావు మాట్లాడారు.
మోడల్ స్కూల్స్ ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిందని, దీనివల్ల వేలాది మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చదువు దూరమైందని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను కూడా కేంద్ర సర్కారు తగ్గించిందని ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సర్కారు విద్యాశాఖకు రూ.25వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 298 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా.. తాము అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను 1200కు పెంచామని మంత్రి గుర్తు చేశారు. విద్యాశాఖలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రమోషన్ల ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.