Saturday, January 18, 2025
Homeసినిమాసుకుమార్ - చరణ్ కాంబినేషన్ మళ్లీ రెడీ!

సుకుమార్ – చరణ్ కాంబినేషన్ మళ్లీ రెడీ!

సుకుమార్ – చరణ్ కాంబినేషన్ మళ్లీ రెడీ అయింది. అవును .. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులు పూర్తవగానే, ఇద్దరూ కలిసి తమ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. మెగా ఫ్యామిలీతో సుకుమార్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ‘రంగస్థలం’ సినిమా తరువాత అది మరింత బలపడింది. చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. 50 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

అప్పటి నుంచి కూడా చరణ్ – సుకుమార్ కలిసి మరో సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తూనే  వచ్చింది. కానీ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉంటూ వచ్చారు. వాళ్ల స్థాయికి తగిన కథ కూడా సెట్ కాలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. గతంలో ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ వారే ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. వారి నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా. అందువలన భారీ షెడ్యూల్స్ తోనే చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అప్పటివరకూ సుకుమార్ ఈ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ తరువాతనే చరణ్ ప్రాజెక్టుకి సంబంధించిన ఇతర సన్నాహాలలో వేగం పెరగనుంది. ఇక ఈలోగా చరణ్ .. బుచ్చిబాబు సినిమాను పూర్తిచేస్తాడన్నమాట. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, ‘పెద్ది’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్