Saturday, January 18, 2025
Homeసినిమాఈ సారైనా పాత సునీల్ కనిపిస్తాడా?

ఈ సారైనా పాత సునీల్ కనిపిస్తాడా?

ఒకప్పుడు తెలుగు తెరపై సీనియర్ కమెడియన్స్ హవా కొనసాగింది. బ్రహ్మానందం ..  ఏవీఎస్ .. ధర్మవరపు .. వేణు మాధవ్ .. కృష్ణభగవాన్ .. ఇలాంటి స్టార్ కమెడియన్స్ తో కామెడీ అనేది కట్టలు తెంచుకుని పరిగెత్తింది. అంత పోటీని తట్టుకుంటూ స్టార్ కమెడియన్ గా సునీల్ ఒక వెలుగు వెలిగాడు. ఆ తరువాత హీరోగా వేషాలు రావడంతో ఆశగా అటువైపు వెళ్లాడు. అక్కడ ఆరంభంలో వరుస విజయాలు ఎదురైనా, ఆ తరువాత అపజయాలే అక్కున చేరాయి. కమెడియన్ గా ఏడాదికి పది సినిమాలు చేసే సునీల్, హీరోగా ఒక సినిమా చేయడం కష్టమైపోయింది.

అలాంటి పరిస్థితుల్లో సునీల్ తిరిగి వెనక్కి వచ్చేశాడు. కమెడియన్ గా మళ్లీ తన స్థానాన్ని ఆక్రమించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఇంతవరకూ ఫలించలేదనే చెప్పాలి. ఆల్రెడీ వెన్నెల కిశోర్ హవా కొనసాగుతూ ఉండటం .. గతంలో మాదిరిగా తనకి సరైన పాత్ర పడక పోవడం వలన సునీల్ కమెడియన్ గా తన పూర్వ స్థానానికి చేరుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సునీల్ ప్రత్యేకమైన పాత్రల దిశగా .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల దిశగా ఫోకస్ పెడుతూ వెళుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా.

అయితే సునీల్ కామెడీని గతంలో మాదిరిగా చూడాలని ఆశపడే అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లంతా కూడా ఆయన నుంచి ఆ తరహా పాత్ర కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారందరికీ తీపి కబురు అంటూ, ‘ఊర్వశివో రాక్షసివో‘ సినిమాలో పాత సునీల్ ను చూస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అన్నాడు. అదే జరిగితే సునీల్ ను మరిన్ని కామెడీ రోల్స్ లో చూడొచ్చు. అయితే కమెడియన్ గా సునీల్ పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే అందుకు తగిన పాత్రను త్రివిక్రమ్ రాయవలసిందే అనేవారు లేకపోలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్