Thursday, March 19, 2026
HomeTrending NewsBiodiversity Index: జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ది

Biodiversity Index: జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ది

హైదరాబాద్ నగర జీవవైవిధ్య సూచీ(సిటి బయోడైవర్సిటీ ఇండెక్స్)ని మంత్రి కే. తారకరామారావు నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో విడుదల చేశారు. ఒక నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు చేసిన ఏకైక భారతదేశ నగరంగా హైదరాబాద్ ఘనత సాధించినట్లు అయింది. గతంలో ఒకసారి 2012లో (సిఓపి COP11 సమావేశం) సందర్భంగా హైదరాబాద్, 2017లో కొల్ కత్తా ఒకసారి నగర జీవవైవిధ్య సూచిని రూపొందించాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ ను తిరిగి రెండోసారి రూపొందించిన తాజా నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది. నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధికి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడనుంది, బయోడైవర్సిటీ రంగంలో సింగపూర్ చేసిన భాగస్వామ్యానికి గుర్తింపుగా దీన్ని సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నారు.

నగర జీవవైవిద్య సూచీ వలన ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రయత్నాలు, ఈ రంగంలో స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు వంటి మెత్తం 23 రకాల అంశాలను కొలమానంగా తీసుకొని, ఈ సూచీని రూపొందించడం జరుగుతుంది. మొత్తం 23 అంశాలకు గాను అత్యధికంగా 92 మార్కులను కేటాయించడం జరుగుతుంది. తాజాగా జీహెచ్ఎంసి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 92 మార్కులకు గాను 57 మార్కులను సాధించింది. అయితే 2012లో నగరంలో అప్పుడు జరిపిన బయోడైవర్సిటీ ఇండెక్స్ అధ్యయనంలో కేవలం 36 మార్కులు మాత్రమే లభించాయి. గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధిని సాధించింది.

సరస్సుల నగరంగా పేరొందిన హైదరాబాద్ లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350 కి పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు(రాక్ ఫార్మేషన్స్) , నగరంలో ఉన్న రెండు జాతీయ పార్కులు( కేబీఆర్ తో పాటు హరిణి వనస్థలి) నగరంలో జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో తేలింది. దీంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిసాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్ లు జీవవైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయని తేలింది. ఇలా హైదరాబాద్ నగరానికి ఉన్న సహజ సిద్ధమైన జీవవైవిధ్య వనరులను పరిరక్షించడం ద్వారా నగర జీవవైవిధ్య సూచీలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశం కలిగింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 1305 వృక్షజాతులు ఉండగా, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్ష జాతులు నగరంలో ఉన్నాయని తేలింది. 30 రకాల తూనీగ జాతులు (odonates), 141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల (amphibians) ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు (mammalian) ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.

హైదరాబాద్ నగర జీవవైవిధ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా నిలిచాయని, భవిష్యత్తులోనూ నగరంతోపాటు, నగరం చుట్టుపక్కల కూడా జీవివైవిధ్యం మరింత పెరుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పురపాలికల్లో జీవవైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందని, దీంతోపాటు పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటు వంటి అనేక ఇతర హరిత కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్థావించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి అటు పట్టణాలు, ఇటు పల్లెల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా హరిత కవర్ పెరిగిందని, దీంతో జీవవైవిధ్యం పెరిగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అనేక పట్టణాలకు ఈ కేటగిరీలో అవార్డులు సైతం లభించాయని కేటీఆర్ తెలిపారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల్లో బయోడైవర్సిటీ పట్ల మరింత అవగాహన పెంచేలా చర్యలు చేపడతామన్నారు. జూన్ 5వ తేదీన పట్టణాల్లో హరితాన్ని పెంచిన పురపాలికలకు, వాటి సిబ్బందికి ప్రత్యేకంగా హరిత అవార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular