ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫార్సు చేసింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేయాలని కోలీజియం నిర్ణయించింది.
మరోవైపు, కర్నాటక హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పని చేస్తున్న సతీష్ శర్మ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులు కానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న హిమా కోష్లీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆమె స్థానంలో జస్టిస్ ఎమ్మెస్ రామచంద్ర రావు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు సతీష్ శర్మ సిఫార్సుతో తెలంగాణా హైకోర్టుకు పూర్తి స్తాయి చీఫ్ జస్టిస్ రానున్నారు. కోలీజియం సిఫార్సులు రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి.
1964, ఆగస్ట్ 29న రాయగడ్ లో జన్మించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా బిలాస్ పూర్ గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. రాయగడ్ జిల్లా కోర్టులో, జబల్పూర్ లోని మధ్యప్రదేశ్ హై కోర్టు, బిలాస్ పూర్ లోని ఛత్తీస్ గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా కొంతకాలం పని చేసిన ప్రశాంత్ 2007 నుంచి రెండేళ్లపాటు అడ్వకేట్ జనరల్ గా కూడా సేవలందించారు. 2009 డిసెంబర్ 10న అయన ఛత్తీస్ గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా పదోన్నతి పొందారు.