మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి తనపై విధించిన రిమాండ్ ను కొట్టి వేయాలంటూ సుప్రీం లో బాబు క్వాష్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత వారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 17(ఏ)పై ఏపీ హైకోర్టుకు సమర్పించిన పత్రాలను అందజేయాలని ఏపీ సిఐడిని ఆదేశించి విచారణను నేటికి వాయిదా వేసింది.
నేడు మధ్యాహ్నం విచారణ ప్రారంభించిన ధర్మాసనం ఎదుట బాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున రేపు వాదనలు వినిపిస్తానని ముకుల్ రోహాత్గీ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించి రేపు ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని చెప్పింది.
17 (ఏ) పైనే నేడు ప్రధానంగా వాదనలు జరిగాయి. అవినీతి జరగ కూడదన్నదే ప్రధాన ఉద్దేశమని, ముందస్తుగా అనుమతి తీసుకోనంత మాత్రాన అవినీతిపై చర్యలు తీసుకోవద్దని ఎలా చెబుతారంటూ న్యాయమూర్తి త్రివేది ప్రశ్నించారు.
మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను, మరో ఐదు రోజులపాటు బాబును రిమాండ్ కు ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.