Saturday, November 23, 2024
HomeTrending Newsసమగ్ర అఫిడవిట్ : సుప్రీం సూచన

సమగ్ర అఫిడవిట్ : సుప్రీం సూచన

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బోర్డుల పరీక్షలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన అధ్యయనం, ఏర్పాట్లు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్ధులు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఫలితాలు ఆలస్యమైతే తదుపరి తరగతుల అడ్మిషన్స్ వాయిదా వేస్తారా, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులు మళ్ళీ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోరితే ఏం చేస్తారు అంటూ ప్రశ్నలు సంధించింది. అన్ని అంశాలపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని. సోమవారం వరకూ గడువు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం కోరింది. దీనికి నిరాకరించిన సుప్రీం రేపు మధ్యాహ్నం వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

కరోనా కేసులు తగ్గుతున్నందున పరిక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నామని, అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ 10, 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిన్న సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒక్కోగదిలో 15 నుంచి 18 మంది విద్యార్ధులకు మించకుండా చూస్తామని, ఉపాధ్యాయులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి జూలై చివరి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనందున నిర్వహణకే మొగ్గు చూపుతున్నామని ఏపి ప్రభుత్వం తెలిపింది. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లో ఉందని, ఇంటర్ మార్కుల వెయిటేజ్ అనేది భవిష్యత్లో ఎంసెట్, తదితర ప్రవేశ పరీక్షల్లో ఉపయోగమని, అందుకే విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొనే నిర్వహణకు సంనద్ధమవు తున్నామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. దీనిపై నేడు విచారించిన సుప్రీం కోర్టు సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

లక్షలాది మంది విద్యార్ధులు, తల్లిదండ్రులు ఉత్కంత గా ఎదురుచూస్తున్న ఈ పరీక్షల నిర్వహణ అంశం రేపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్