Saturday, January 18, 2025
HomeTrending Newsటి-హబ్ సందర్శించిన ఐఏఎస్ అధికారుల బృందం

టి-హబ్ సందర్శించిన ఐఏఎస్ అధికారుల బృందం

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలోని టీ హబ్ ను దాదాపు 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగఅధిపతులు టి హబ్ ను సందర్శించారు. టి హబ్ ద్వారా అవిష్కరించిన ఇన్నోవేషన్లను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అడాప్ట్ చేసుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు టి హబ్ కేంద్రంగా జరిగిన ఆవిష్కరణలు దోహద పడేందుకై ఈ పర్యటనను సి.ఎస్. ఏర్పాటు చేశారు. ఉదయం టి హబ్ ను చేరుకున్న ఐఏఎస్ అధికారుల బృందం టి హబ్ లోని పలు ఇన్నోవేషన్ హబ్ లైన వీ- హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్ ), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణా (రిచ్ ), ఇమేజ్ తదితర కేంద్రాలను సందర్శించి వారు రూపొందించిన పలు ఆవిష్కరణలను ఐఏ ఎస్ అధికారులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.


ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్స్ వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సమర్థత, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడమే కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ నూతన ఆవిష్కరణలు సహాయపడతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకునే సాంకేతికతలకు అనుగుణంగా ఆయా శాఖల్లో సర్వీస్ డెలివరీ వ్యవస్థను మెరుగుపరచడానికి నూతన ఆవిష్కరణలను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాఠశాల నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని ఆయన ఉద్ఘాటించారు.

ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ… టి హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను అందించిందని, స్టార్టప్‌లు మరియు ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతుందని అన్నారు. 2000 కంటే ఎక్కువ జాతీయ మరియు అంతర్జాతీయ స్టార్టప్‌లకు మెరుగైన సాంకేతికత, ప్రతిభ, సలహాదారులు, కస్టమర్‌లు, కార్పొరేట్, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు అందించిందని తెలిపారు.. జాతీయ, అంతర్జాతీయంగా వివిధ సంస్థలతో టి హబ్ కలసి పనిచేయడం, సహకారాల గురించి వివరించారు. టి హబ్‌ను ఏడేళ్ల క్రితం స్థాపించామని, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హెల్త్‌ తదితర రంగాల్లో స్వల్ప వ్యవధిలో 260 స్టార్టప్‌లు 1.9 ట్రిలియన్‌ డాలర్ల వ్యాపారంతో టి-హబ్‌ నుంచి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెండు ఇన్నోవేషన్ సెంటర్లు ఉండగా, గత ఎనిమిదేళ్లలో వాటి సంఖ్య 63కి పెరిగిందని వెల్లడించారు.

టి హబ్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన దృష్ట్యా రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వి-హబ్‌ను (WE-HUB) ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తోంది. అదేవిధంగా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ మరియు అగ్రికల్చర్ టెక్నాలజీ రంగాలలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వివిధ విద్యా సంస్థల సహకారంతో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) 2017లో ప్రారంబించామని వివరించారు.. తెలంగాణ అకాడమీ ఫర్ సైన్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రాష్ట్రంలో విభిన్న ఆవిష్కరణలలో ముందంజలో ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, పీసీసీఎఫ్ లతో కలసి దాదాపు నలభై మంది సీనియర్ ప్రభుత్వ అధికారులు టి హబ్‌ ఇన్నోవేషన్ వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు.

Also Read : టీ హ‌బ్ నేష‌న‌ల్‌ రోల్‌మోడ‌ల్‌: సీఎం కేసీఆర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్