Sunday, January 19, 2025
Homeసినిమాటికెట్ ధరల పెంపుపై త్వరలో నిర్ణయం : మంత్రి తలసాని

టికెట్ ధరల పెంపుపై త్వరలో నిర్ణయం : మంత్రి తలసాని

decision on Ticket Rates soon:
సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్ర‌ముఖుల‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల గురించి చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్న బాబు), సునీల్ నారంగ్, డివివి దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాల గోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయని నిర్మాతలు మంత్రికి వివరించారు. సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని వివరించారు. కరోనా వల్ల సుమారు 2 సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, తెలియజేస్తూ టికెట్ ధరల పెంపు పై ఒక తుది నిర్ణయం తీసుకొని ధరలు పెంచి సినిమా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ “లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన రెండు  సంవత్సరాల నుండి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందని అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. థియేటర్ ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి కెసియార్ దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్