రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు కె.నారాయణ స్వామిని చిత్తూరు నుంచి లోక్ సభ బరిలో దింపాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం చిత్తూరు ఎంపిగా ఉన్న రెడ్డప్ప గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఉంటారు. వైఎస్సార్సీపీ నాలుగో విడత నియోజక ఇన్ ఛార్జ్ ల జాబితాను నేడు విడుదల చేశారు. ఒక ఎంపి, 8 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు. నారాయణస్వామి స్థానంలో ఆయన కుమార్తె కృపా లక్ష్మిని గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో ఈ నిర్ణయం మార్చుకున్నారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి, ప్రస్తుతం కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితను ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురంకు మార్చారు. అక్కడి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు నుంచి పోటీలో నిలపనున్నారు.
కాగా, శింగనమల, నందికొట్కూరు, తిరువూరు, మడకశిర, కనిగిరి ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, ఆర్థర్, రక్షణనిధి, తిప్పేస్వామి, బుర్రా మధుసూదన్ యాదవ్ లకు టిక్కెట్లు నిరాకరించి వారి స్థానంలో ఎం. వీరంజనేయులు(శింగనమల); డాక్టర్ సుదీర్ దారా(నందికొట్కూరు); నల్లగట్ల స్వామిదాస్ (తిరువూరు); ఈర లక్కప్ప (మడకశిర); దద్దాల నారాయణ యాదవ్ (కనిగిరి) లను కొత్త ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.