Sunday, January 19, 2025
HomeTrending Newsకోనసీమలో కొబ్బరికాయలన్నీ...: అంబటి ఎద్దేవా

కోనసీమలో కొబ్బరికాయలన్నీ…: అంబటి ఎద్దేవా

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకూడదన్నదే తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న మీడియా లక్ష్యంగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి కాకూడదని కోనసీమలో ఉన్న కొబ్బరి కాయలన్నీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక బల్క్ డ్రగ్ పార్క్ వస్తే దాన్ని వద్దంటూ కేంద్రానికి టిడిపి నేత యనమల లేఖ రాయడం దారుణమని వ్యాఖ్యానించారు. మీ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లో దూరాడని ఇల్లు మొత్తం తగలబెట్టుకున్నట్లు  టిడిపి పరిస్థితి ఉందన్నారు.  విజయవాడలో అంబటి మీడియాతో మాట్లాడారు.

పోలవరం కేంద్రం కట్టాల్సి ఉండగా మీరు ఎందుకు తీసుకున్నారు? 2018నాటికి పూర్తి చేస్తామని ఎందుకు చేయలేకపోయారు?కాఫర్ డ్యామ్ కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? అని తాను అడిగిన ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం లేదని, వారు చెప్పే వరకూ ఈ మూడు ప్రశ్నలూ తాను అడుగుతూనే ఉంటామని అంబటి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్ని గతంలో కాంగ్రెస్ హయంలో మొదలు పెట్టారని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉండగా అన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారని వివరించారు. చంద్రబాబు 14 ఏళ్ళు సిఎంగా ఉన్నా, ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపలేదని విమర్శించారు. సంగం, నెల్లూరు బ్యారేజీలు రెండూ  కష్టం మాది అయితే రిబ్బన్ జగన్ కత్తిరించారంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. ఈ రెండు బ్యారేజీల అంచనా విలువ 610 కోట్ల రూపాయలు అయితే దానిలో టిడిపి హయాంలో ఖర్చు చేసింది 150.55 కోట్లు మాత్రమేనని … వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే 82శాతం తాము పూర్తి చేశామని టిడిపి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ సిఎం అయిన తరువాత గుండ్లకమ్మ గేట్లకు తుప్పు పట్టలేదని అంతకు ముందే అవి మరమ్మతు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. బాబు ఐదేళ్ళలో గుండ్లకమ్మ ప్రాజెక్టు 6 కోట్లు కేటాయిస్తే వాటిని ప్రాజెక్టు కోసం కాకుండా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల సుందరీకరణ, గెస్ట్ హౌస్, తెలుగుతల్లి విగ్రహం కోసం మాత్రమే ఖర్చు  పెట్టారని వివరించారు. కమీషన్లు వచ్చే పనుల మీదే శ్రద్ధ పెట్టారని అంబటి ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్