ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు అయన ఒక లేఖ రాశారు. కేంద్రంలో ఈ మంత్రిత్వ ఆధ్వర్యంలోనే అఖిల భారత సర్వీసు ఉద్యోగులు పని చేస్తుంటారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆదిత్యనాథ్ నిందితుడిగా ఉన్నారని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి సీఎం జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. జగన్ కేసుల్లో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా పది లక్షల లీటర్ల నీటిని గతంలో ఆదిత్యనాథ్ కేటాయించారని కనకమేడల గుర్తు చేశారు.
ఇలాంటి వ్యక్తిని సిఎస్ పదవిలో కొనసాగిస్తే ప్రజావ్యవస్థలపై, ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రవీంద్రనాథ్ తన లేఖలో కోరారు. 2021 జనవరి 1 నుంచి ఆదిత్యనాథ్ ఏపి సిఎస్ గా కొనసాగుతున్నారు. జూన్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సిఎస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్రం తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ లేఖ రాయడం చర్చనీయాంశం అయ్యింది.