Friday, October 18, 2024
HomeTrending Newsబిజెపితో టిడిపి జతకడుతుందా?

బిజెపితో టిడిపి జతకడుతుందా?

తెలుగుదేశం పార్టీ – బిజెపి ల మధ్య పొత్తులు కొలిక్కి వస్తున్నాయని ఢిల్లీ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిజెపితో పొత్తుకు చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారనేది చూడాలి. గెలుపే లక్ష్యంగా మంత్రాంగం చేస్తున్న చంద్రబాబు…బిజెపిని కలుపుకొని పోతే బాగుంటుందని జనసేన అధినేత పవన కళ్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా… ఏమేరకు ప్రభావితం చేస్తున్నారో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

టిడిపి-జనసేన పొత్తు ఇప్పటికే ఖారారైంది. బిజెపి కూడా జతకడితే సంపూర్ణం అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. కూటమిలో బిజెపి ఉంటే టిడిపితో జరిగే బేరసారాల్లో జనసేనకు కొంత మేలు జరుగుతుందని, లేదంటే పవన్ కళ్యాణ్ మాట ఖాతరు చేయరని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తుతో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బిజెపి 2019 ఎన్నికల్లో చతికిల పడింది. ఒక్కసీటు కూడా సాధించలేదు. 2019 ఎన్నికల్లో యుపిఏ కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాతో బిజెపితో గిల్లికజ్జాలు పెట్టుకొని ఎన్డిఏ కూటమికి దూరమైన చంద్రబాబు తీవ్రస్థాయిలో భంగపాటుకు గురయ్యారు. స్కిల్ డెవెలప్మెంట్ కేసులో సిబిఎన్ అరెస్టు తర్వాత మళ్ళీ రెండు పార్టీల మధ్య కొంత సఖ్యత కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో సైకిల్ తో కలిసి సవారీ చేసేందుకు కమలం నేతలు చొరవ చూపుతున్నా బాబు అంగీకరించటం లేదు. మైనారిటీ ఓటర్లు దూరం అవుతారని తెలుగు తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బిజెపితో పొత్తుకు చంద్రబాబు ఆసక్తి చూపకపోవచ్చని తెలిసింది. బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ తో కొనసాగటమే మేలని చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏమి లేదనుకున్న కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగి ప్రజలు ఆదరించారని, జాతీయ స్థాయిలో ఈ దఫా అదే జరుగుతుందని తెలుగుదేశం ముఖ్య నేతలు అంటున్నారు.

దీనికితోడు ఇటీవల మోడీకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్న వ్యూహకర్త ప్రశాంత కిషోర్ రాబోయే ఎన్నికల్లో టిడిపితో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌ అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం గాలి వీస్తోందని చెప్పేందుకే ఈ తతంగమని వినికిడి. ఈ నేపథ్యంలో చంద్రబాబు – ప్రధాని మోడీ కలవటం అసాధ్యమనే చెప్పవచ్చు.

శాసనసభ స్థానాల్లో కమలం వికసించే సూచనలు లేకపోయినా… ఎంపి స్థానాల్లో మాత్రం ఒకటి రెండు చోట్ల బిజెపి సీట్లు సాధిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో బిజెపికి ఎంపి స్థానాలు రావచ్చని అంటున్నారు. పొత్తుతో అసెంబ్లీ కన్నా ఎంపి సీట్లు గెలవాలని కమలనాథుల వ్యూహంగా ఉంది. ఎంపి సీట్ల కోసం ఎదో రీతిగా జట్టు కట్టాలని బిజెపి ఢిల్లీ పెద్దలు రాయబారాలు నిర్వహిస్తున్నారు.

తాజా పరిణామాలు విశ్లేషిస్తే టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసేందుకు తెరవెనుక సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయని ఢిల్లీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరితే జగన్ ను ఒంటరి చేశారనే భావన ప్రజల్లో పెరుగుతుందని దీంతో మరోసారి ఫ్యాన్ గాలి వీస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్