తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బిజెపి అగ్ర నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంపై తుది రూపు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 ఎన్నికల్లో మాదిరిగా 2024లో కూడా ఏపీలో బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామిగా ఉన్న పవన్ టిడిపితో సీట్ల సర్దుబాటు కూడా కుదుర్చుకున్నారు. మరోవైపు బిజెపితో పొత్తుకు తెలుగుదేశం పార్టీ కూడా సుముఖంగానే ఉంది. బిజెపితో పొట్టు వల్ల మైనార్టీ ఓట్లకు గండి పడుతుందని, అంతిమంగా అది జగన్ కు మేలు చేస్తుందని టిడిపిలోని కొంతమంది నేతలు బహిరంగంగానే చెబుతున్నా… కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉండి వరుసగా మూడో పర్యాయం కూడా బిజెపియే అధికారం చేపట్టనుందని మెజార్టీ సర్వేలు ధృవీకరిస్తుండడంతో బిజెపితో పొత్తుతో వెళితేనే అన్ని విధాలుగా శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం జనసేన మద్యం సీట్ల పంపకం దాదాపు ఖరారైంది. మొత్తంగా 25 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు జనసేనకు కేటాయించేలా ప్రాథమికంగా అంగీకారం కుదిరింది. బిజెపి కూడా తమ కూటమిలో చేరితే వారికి ఎన్ని సీట్లు ఇవ్వలనేదానిపై కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం.
తెలుగుదేశంతో పొత్తుకు బిజెపి పెద్దలను పవన్ కళ్యాణ్ ఒప్పించారని, దీనిలో భాగంగానే ఢిల్లీ నుంచి చంద్రబాబుకు పిలుపునిందని తెలుస్తోంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డాను రేపు చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలవనున్నారు.
నాలుగైదు రోజుల్లోనే ఈ పొత్తుకు సంబంధించినటువంటి కీలక ప్రకటన వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యా తర్వాత ఏయే పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశానికి తుది రూపు రానుంది.