Sunday, January 19, 2025
HomeTrending Newsబద్వేల్: తప్పుకున్న టిడిపి - బరిలో బిజెపి

బద్వేల్: తప్పుకున్న టిడిపి – బరిలో బిజెపి

బద్వేల్ ఉప ఎనికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. నేడు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాలని టిడిపి గతంలో నిర్ణయించింది. రెండ్రోజుల క్రితం కూడా కడప జిల్లా టిడిపి నేతలు చంద్రబాబును కలుసుకొని ప్రచార వ్యూహంపై చర్చించారు. అయితే ఎమ్మెల్యే  చనిపోయిన చోట అయన కుటుంబ సభ్యులకు సీటు కేటాయిస్తే పోటీ చేయకూడదన్న గత సంప్రదాయాన్ని పాటిస్తూ పోటీకి దూరంగా ఉండాలని పార్టీలోని కొందరు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ సంప్రదాయాన్ని వైఎస్సార్సీపీ తప్పిందని, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో చనిపోయిన ఎంపీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తిని అధికార పార్టీ నిలబెట్టినందున తాము పోటీ చేయాల్సి వచ్చిందని టిడిపి నేతలు చెప్పారు. దీనిపై నేడు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులతో జూమ్ ద్వారా చర్చించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పోటీ నుంచి వైదొలిగేందుకే మొగ్గు చూపారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపై ప్రతిపక్షాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, కడపలో జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బద్వేల్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేనను పోటీచేయాలని కోరామని, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పిందని సోము వెల్లడించారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని అందుకే బరిలో ఉంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరామని, ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ తో చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తామని, బద్వేలులో జనసేన మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామని వీర్రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. మేం అభివృద్ధి చేస్తున్నాం, ప్రభుత్వం అవినీతి చేస్తోంది…ఇదే మా ఎన్నికల అజెండా అంటూ వ్యాఖ్యానించారు.

తాము పోటీ చేయడం లేదని నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో నేడు టిడిపి కూడా అదే బాటలో తమ నిర్ణయం వెలువరించడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతవారం షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 1న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. దివంగత ఎమ్మెల్యే భార్య డా. సుధనే అధికార వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్