రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేడు సమావేశమైన స్ట్రాటజీ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. సమావేశం అనంతరం చంద్రబాబు పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు.
గతంలో కూడా కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం గార్లలను టిడిపి బలపరిచింది. అలాగే లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతి గార్లను టిడిపి చేసింది. కేంద్ర మంత్రిగా కింజారపు ఎర్రంనాయుడుని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచింది. ఈ విధంగా తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టిడిపి ముందు వరుసలో నిలబడిందని చంద్రబాబు పేర్కొన్నారు.