Saturday, January 18, 2025
HomeTrending Newsవిద్యుత్ పై నిజాలు చెప్పండి: టిడిపి డిమాండ్

విద్యుత్ పై నిజాలు చెప్పండి: టిడిపి డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం, థర్మల్ విద్యుత్, హైడల్ విద్యుదుత్పత్తిపైన ప్రభుత్వం అసలు విషయాలు ప్రజలకు చెప్పగలదా అంటూ ప్రశ్నించారు.  మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10,430 మెగా వాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం కేవలం మూడువేల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని అయన వెల్లడించారు.

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా 25 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని వీటిలో ఆరువేల కోట్లు దారి మళ్ళించారని ఆరోపించారు. విద్యుత్ వాడకం 20 శాతం పెరిగిందంటూ ప్రభుత్వం చెప్పిన దానిలో ఏమాత్రం వాస్తవం లేదని, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 63,311 మిలియన్ యూనిట్ల వినియోగం ఉందని, 2019-20 లో 62,790; 2020-21లో  59, 911; 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరు వరకూ 28,557 యూనిట్లు వినియోగం జరిగిందని, అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే తక్కువ వినియోగం జరిగిందని కనకమేడల వివరించారు.

విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డ 22 వేల కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదని, విద్యుత్ కార్పొరేషన్ ద్వారా తెచ్చుకున్న అప్పుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని కనకమేడల మండిపడ్డారు. సిఎం జగన్ తన కుటుంబానికి చెందిన సండూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకే కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటివరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 12 వేల కోట్ల రూపాయల భారం మోపారని కనకమేడల విమర్శించారు.

రాష్ట్రంలో విద్యుత్ తో పాటు ఆర్ధిక రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అందుకే కాంట్రాక్టర్లు ఎవరూ పాత బకాయిలు చెల్లించకపోతే కొత్త పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని, రోడ్ల మరమ్మతుల కోసం టెండర్లు కూడా వేయడం లేదని, ఉపాధి హామీ బకాయిలు కూడా ఇంతవరకూ చెల్లించలేదని అయన గుర్తు చేశారు. ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని తాము కోరినా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదన్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్