Sunday, January 19, 2025
HomeTrending Newsబిసిలకు న్యాయంచేసే బాధ్యత నాది: బాబు

బిసిలకు న్యాయంచేసే బాధ్యత నాది: బాబు

తెలుగుదేశం పార్టీ రూపొందించిన బిసి ప్రణాళిక ‘జయహో బిసి’ ను రాబోయే 40 రోజుల్లో ఇంటింటికీ తీసుకు వెళ్లాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బిసిలను రాజకీయంగా, ఆర్ధికంగా ఆదుకున్న పార్టీ టిడిపి అయితే, వారిని మోసం చేసిన చరిత్ర జగన్ దని విమర్శించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జయహో బిసి కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏ వర్గానికైనా అవకాశం ఇచ్చినప్పుడే ప్రతిభ చూపిస్తారని, అసలు అవకాశమే ఇవ్వకపోతే ఎవరూ నాయకులుగా ఎదగలేరని, లక్షలాది మంది బిసిలను నేతలుగా టిడిపి తీర్చిదిద్దిందని, స్థానిక సంస్థల్లో తాము బిసిలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తే వైసీపీ రాగానే దాన్ని 24కు తగ్గించిందని విమర్శించారు.

వారికోసం 90 శాతం సబ్సిడీతో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు కూడా అందించామని, కానీ నాలుగున్నరేళ్ళలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అని బాబు ప్రశ్నించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతుంటారని కానీ నిధులు లేకుండా వాటిని ఏర్పాటు చేసి ఏమి ఉపయోగమని అన్నారు. రాష్ట్రం మీద 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, దీనిలో రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బిసిల నెత్తిన ఉన్న అప్పు ఆరున్నర లక్షల కోట్ల రూపాయని వెల్లడించారు. పాలన అంటే 100 రూపాయలు దోచుకొని 10 రూపాయలు ఇవ్వడమా అని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ అండగా నిలబడింది వెనుకబడిన వర్గాలు మాత్రమేనని, అందుకే వారి సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడతామని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని అగ్రస్థానాల్లో బిసిలను కూర్చోబెట్టే బాధ్యత తనదేనని, అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు.  ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తూనే ఎమ్మెల్సీలు, ఇతర పదవులు కూడా ఇస్తామన్నారు.

రాబోయే వందరోజులు పార్టీ కోసం, రాష్ట్రం కోసం,. బిసిల కోసం పని చేయాలని ఆ తర్వాత ఈ వర్గాలకు ఏ విధంగా మంచి చేయాలో తాను ఆలోచిస్తానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్