ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న కల్తీ మద్యం వల్లే రాకేశ్ మాస్టర్ చనిపోయారని టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. బూమ్ బూమ్ బీరు తాగడం వల్లే ఆయన మరణించారన్నారు. మద్యం తాగాలని తాము చెప్పడం లేదని, కానీ ఈ అలవాటు ఉన్నవారు మరో ఎనిమిది నెలలపాటు రాష్ట్రంలో మద్యం తాగవద్దని, ఎప్పుడైనా తాగాలని అనిపిస్తే బస్సు, రైలు ఎక్కి హైదరాబాద్, చెన్నై వెళ్లి తాగి రావాలని కోరారు. దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నారని, తాము అధికారంలోకి రాగానే మద్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, నాయకులతో పాటు దీనిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. టిడిపి తరువాత మంచి మందును అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం లేదని, దశలవారీగా మద్యపానాన్ని నియంత్రించడం కూడా సాధ్యం కాదన్న విషయాన్ని సిఎం జగన్ స్వయంగా చెపాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ఏపీలోని లిక్కర్ షాపుల్లో రెండు వేల రూపాయల నోట్లను మారుస్తున్నారని, దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై దృష్టి సారించాలని కోరారు.
జగన్ ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని, ఆయన ఎంత దోచుకున్నా మరో ఎనిమిది నెలలు మాత్రమేనని…. ఆ తరువాత ఆయన ఇంటికి పోవడం ఖాయమని ఆనం ధీమా వ్యక్తం చేశారు.