రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 4 వేల కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.
రెడ్డిగూడెం మండలం కునపరాజుపర్వ గ్రామంలో రైతులను పరామర్శించారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో వలన ఖరీఫ్ సీజన్ లో రైతులు నారు వేసుకునే పరిస్థితి కూడా లేదని అయన ఆందోళన వ్యక్తం చేశారు. దళారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని దేవినేని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు బోగస్ అన్నారు. రైతులను ఆదుకోలేని కార్యక్రమాలు ఎన్నిపెట్టినా ప్రయోజనం ఏమిటని అయన ప్రశ్నించారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, వారికి వయాట కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి కూడా లేదని అన్నారు. రైతులను దోచుకున్న మిల్లర్ల సంఘం అధ్యక్షుడిని తీసుకెళ్ళి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ గా చేశారని ఉమా విమర్శించారు.
రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని, రోజుకో ఉద్యమ కార్యాచరణ తో అన్నదాతకు అండగా ఉంటామని అయన హామీ ఇచ్చారు.