Monday, January 20, 2025
HomeTrending Newsరేపేంటో ఆలోచించుకోండి: నక్కా హెచ్చరిక

రేపేంటో ఆలోచించుకోండి: నక్కా హెచ్చరిక

మాచర్లలో జరిగిన దమనకాండ-దహన కాండ కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని, కొంతమంది పోలీసు అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  ఆరోపించారు. ఈ ఘటనపై తాము డిఐజిని కలిశామని,  సెక్షన్ 30అమల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు  ముందస్తు అనుమతి తీసుకోవాల్సింది అని వారు చెప్పారని, ఇదే అనుమతి అధికార పార్టీకి అవసరం లేదా… వారికో రూలు, మాకో రూలు ఉంటుందా  అని నక్కా ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు కొల్లు రవీంద్ర, ఏఎస్ రామకృష్ణ, నసీర్ అహ్మద్ లతో కలిసి ఆనందబాబు మీడియాతో మాట్లాడారు.

ఆరోజు మూడు గంటలపాటు అధికార పార్టీ కార్యకర్తలు పట్టణంలో స్వైర విహారం చేస్తుంటే, టిడిపి ఆఫీసులు, కార్యాలయాలు తగలబెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. దాడులకు గురైన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేదుకు వెళ్తామంటే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాత్రం పర్మిషన్ చ్చారని, బాధితులం తామైతే తమను వెళ్ళనీయకుండా వారికి ఆ అవకాశం ఎలా ఇస్తారని పోలీసులను నిలదీశారు.  తమ పార్టీ  ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డి, కార్యకర్తలు కలిపి మొత్తం 24మంది మీద 307 కేసులు, నాన్ బెయిలబుల్ సెక్షను పెట్టారని, వారి కోసం గాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు మాత్రం మాచర్లలోనే యధేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు.   ఎన్నికలు ముందు వచ్చినా, రాకపోయినా … ఈ ప్రభుత్వం మరో 13 నెలల్లో మారిపోతుందని,  గడియలు లెక్కపెట్టుకోవాలని, తాము అధికారంలోకి రాగానే.. ఇవాళ పెట్రేగిపోతున్న రౌడీలు, ఎమ్మెల్యే-ఆయన సోదరులు, తాబేదార్లు రేపటి పరిస్థితి ఏమిటో గుర్తు పెట్టుకోవాలని నక్కా హెచ్చరించారు.  అధికారులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీకి ఊడిగం చేస్తున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్