అభివృద్దికి చిరునామా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. రెండు వారాల క్రితం కోల్ కతా విమానాశ్రయంలో రేడియో ధార్మిక అణుపదార్ధాన్ని బెంగాల్ సిఐడి పోలీసులు పట్టుకున్నారని, దీని మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోని పులివెందులలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. షుమారు 4,250 కోట్ల రూపాయల విలువైన యురేనియం పట్టుకున్నారని, దీనివెనుక ఉన్న సూత్రదారులేవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తల నీలాలు కూడా అంతర్జాతీయ మాఫియా మయన్మార్ కు తరలిస్తుంటే మిజోరాం వద్ద అస్సాం రైఫిల్స్ పట్టుకున్న విషయం వాస్తవం కాదా అని నరేంద్ర ప్రశ్నించారు. తాజాగా సుమారు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ అఫ్ఘానిస్థాన్ నుంచి విజయవాడకు దిగుమతి చేసుకుంటుంటే పోలీసులు పట్టుకున్నారని, ఇంత మొత్తంలో హెరాయిన్ పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటి సారి అని అయన అన్నారు. ఇప్పటికే 70వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్22 కంటైనర్లలో ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నట్లు వస్తున్న వార్తలు విస్మయం కలిగిస్తున్నయన్నారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ రాష్ట్రానికి రావడం చిన్న విషయం కాదని, దీని వెనుక పెద్ద మనుషుల హస్తం ఉంది ఉంటుందని, వారెవరో నిగ్గు తేల్చాలని కోరారు. గంజాయి విచ్చలవిడిగా ప్రతి గ్రామలోనూ దొరుకుతోందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం, హెరాయిన్ సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని ధూళిపాల విజ్ఞప్తి చేశారు.