Sunday, January 19, 2025
HomeTrending Newsపట్టాభికి 14 రోజుల రిమాండ్‌

పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి, అశాంతిని రెచ్చగొట్టేందుకు యత్నించాడంటూ పట్టాభిపై కేసులు నమోదు కాగా నిన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పోలీసులు పట్టాభిని హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ పట్టాభి తరచూ నేరాలకు పాల్పడుతున్నాడని, ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆయన ఇతర కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడని పేర్కొన్నారు.

బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడంలేదని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్దేశ పూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, దీని వెనుక రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించాలన్నదే పట్టాభి లక్ష్యమని తెలుపుతూ. న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను ఆయన ఖాతరు చేయడం లేదని, కేవలం స్వప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పట్టాభికి బెయిల్‌ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడమే సరైన చర్యని కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నవించారు. ప్రస్తుతం పట్టాభిని పోలీసులు మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో చేసినందుకు విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు బుధవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో అతనిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్