వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఓట్లను కూడా దొంగతనం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో దొంగలు పడ్డారని, నాలుగేళ్ళుగా పంచభూతాలనూ దోచుకుంటున్న ఈ దొంగలు ఇప్పుడు చివరి సంవత్సరం, ఎన్నికల వేల ఓట్లను కూడా దొంగతనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ను అచ్చెన్నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం నేతల బృందం కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసింది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ లిఖితపూర్వక ఆధారాలు సమర్పించారు. ఒకే ఇంట్లో ఓట్లను వేర్వేరు బూత్‍లకు బదిలీ చేయడంపై కూడా టిడిపి నేతలు తప్పుబడుతూ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం ఓటమి భయంతోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేరుస్తోందని, మరోవైపు టిడిపి సానుభూతిపరుల ఓట్లను వాలంటీర్ల సహాయంతో, నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారని విమర్శించారు. అక్టోబర్ 17న డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని ఎన్నికళ ప్రధానాధికారి చెప్పారని, ఆ తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే తన దృష్టికి తీసుకు రావాలని కోరారని అచ్చెన్న వెల్లడించారు. అచ్చెన్నాయుడు వెంట ఈసిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు తో పాటు బొండా ఉమా, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.