TDP on KTR: ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వంత పాడుతోంది. ‘కేటిఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట…అట్లుంటది మనతోని…’ అంటూ ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమా ద్వారా ప్రాచుర్యం పొందిన డైలాగ్ ను వాడుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని కేటిఆర్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని టిడిపి సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. గత ఐదేళ్ళలో కరెంట్ కోతలు లేకుండా చూశామని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అస్తవ్యస్త విధానాలతో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు పవర్ కట్స్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రాలో విధ్వంసం – తెలంగాణాలో అభివృద్ధి అనే నినాదంతో కేసిఆర్, కేటిఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం సాగుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విదేశాల్లో ఉన్నవారు హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. కేటిఆర్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని, ఇది ఒక తెలంగాణాలోనే కాదని దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్ళినా ఇదే చర్చ నడుస్తోందన్నారు.
రాష్ట్రంలో పరిస్థితిపై తాము మాట్లాడితే ప్రతిపక్షం ఏదో మాట్లాడిందని అంటారని, కానీ గతంలో జగన్ కు సహకరించిన వారు, పక్క రాష్ట్రం వారు ఏపీ గురించి మాట్లాడుతున్నారని మాజీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
Also Read : మా గ్రామాల్లో వ్యవస్థలు చూడండి: అమర్నాథ్ సలహా