పోలింగ్, తదనంతరం జరిగిన అల్లర్లలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేడు ‘చలో మాచర్ల’కు పిలుపు ఇచ్చింది. వర్ల రామయ్య నేతృత్వంలో నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బొండా ఉమా, మాచర్ల అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులతో కూడిన బృందం మాచర్ల, గురజాల, నరసరావుపేట, పిడుగురాళ్ళలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలను పరామర్శించి, మాచర్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టిడిపి చేపట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదని జిలా ఎస్పీ మాలిక గార్గ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా 144 CRPC సెక్షన్ అమలులో ఉందని, ఈ పరిస్థితుల్లో అక్కడ పర్యటనను విరమించుకోవాలని ఆమె సూచించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదా హాజరవడం, లేదా ర్యాలీగా వెళ్ళకూడదని… నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
మరోవైపు టిటిపి నేతలను ఈ ఉదయం నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గొల్లపూడిలో దేవినేని ఉమా, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనందబాబులను గృహ నిర్భంధం చేశారు.