తెలుగుదేశం మహానాడు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని, సిఎం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకం ఏమిటో చంద్రబాబు చెప్పాలని సవాల్ చేశారు. 14 ఏళ్ళపాటు పరిపాలించిన బాబు పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదల సక్షేమం, అభివృద్ధి కోసం ఏదైనా చేసి ఉంటే ఇప్పుడు పేదరికం ఈ స్థాయిలో ఉండేది కాదుగా అంటూ ప్రశ్నించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు.
బాబు గత ఐదేళ్ళ పాలనలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లో ఉన్నమాటా వాస్తవం అవునా కాదా చెప్పాలన్నారు. ఇప్పుడు వ్యవసాయం 8 శాతం వృద్ధి సాధించిందన్నారు. బాబు పాలనలో కరువు, కాటకాలతో రైతులు వ్యవసాయానికి దూరమైతే ఇప్పడు ఎరువులు, విత్తనాలకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దివంగత నేత వైఎస్ స్పూర్తితో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. మహానాడులో ఓ గోల చేసినంతమాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజలకు మేలు జరిగితే వారు ప్రభుత్వానికి అండగా ఉంటారని… ఇదే విషయాన్ని సిఎం జగన్ కూడా అడుగుతున్నారని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తాము చేసిన మంచిని ప్రజలకు చెబుతామని, వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని బొత్స ధీమా వ్యక్తం చేశారు.