ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏ ఆధారాలతో ఈ లెక్కలు చెబుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ. .ఏపీ ఆర్ధిక వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు అర్థం లేనివన్నారు. వాస్తవానికి, టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారిక లెక్కలు పక్కన పెట్టి ఓ వర్గం మీడియా కూడా.. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాల ఆరోపణలకే ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు. ఆర్థిక మంత్రి హోదాలో పని చేసిన మాజీ మంత్రి యనమల, అధ్యక్షులు చంద్రబాబు సైతం ఒకే పార్టీకి చెందిన వారే అయినా ఒకరు రూ. 7 లక్షల కోట్లు అంటారు, మరొకరు రూ. 10 లక్షల కోట్లు అంటారు, మరోసారి 13 లక్షలని కూడా ప్రచారం చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.వీరందరికి ఈ లెక్కలు ఎవరిచ్చారు ? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్న విషయం ప్రతిపక్షాలకు తెలియనిది కాదన్నారు.అప్పులపై ప్రతిపక్షాలదంతా ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనన్నారు.
కాగ్,ఆర్బీఐ, ఆర్ధిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయడం సాధ్యమవుతుందా ?
ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతుందని ఆరోపిస్తున్న విపక్షాలకు బుగ్గన కౌంటర్ ఇచ్చారు. కాగ్,ఆర్బీఐ, ఆర్ధిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయడం సాధ్యమవుతుందా ? అని ఆయన ప్రశ్నించారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి? ముందు ప్రజలకు చెప్పాలన్నారు. అప్పులపై ఓ వర్గం మీడియా రాసే లెక్కలన్నీ తప్పేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.4,28,715 అని మంత్రి స్పష్టం చేశారు. అందులో రూ.2,71,797 కోట్లు టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు అని పునరుద్ఘాటించారు. ఈ లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,56,925 కోట్లేనని ఆయన చెప్పారు.గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక అప్పు 22 శాతం పెరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 శాతమే అప్పులు పెరిగితే.. ఏవేవో లెక్కలు చెప్పి ప్రజలను గందరగోళానికి గురి చేయడం తగదన్నారు. అప్పులపై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సబబు కాదన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో రెవెన్యూ రాబడి 6 శాతం పెరిగిందన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి పెరిగినా ప్రతిపక్షాలకు కనబడడం లేదన్నారు. ఈ గణాంకాలు చూస్తే సంపద సృష్టించేదెవరో రాష్ట్ర ప్రజలకే అర్థమవుతుందన్నారు. కేంద్రం నుండి మన వాటా నిధులు క్రమం తప్పకుండా సాధించుకుంటున్నామన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్ లో 15 ఏళ్ల డేటా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీ యువతని నిరుద్యోగులుగా చేసిన మీరా 20 లక్షల ఉద్యోగాలిచ్చేది?
బాబొస్తే జాబొస్తుందనే హామీతో ఊదరగొట్టి గత ప్రభుత్వ సమయంలో ఉద్యోగాల ఊసే పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2018-19 చంద్రబాబు పాలనలో 5.3 శాతం నిరుద్యోగం గురించి యువతకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు పాలనలో 2018-19లో 44, 86,000 పీఎఫ్ అకౌంట్లు ఉండగా 2022-23లో పీఎఫ్ ఖాతాలు 60,78,00 గా నమోదవడం గమనిస్తే ఉద్యోగాలిచ్చినదెవరో ఇట్టే తెలిసిపోతుందన్నారు. గత ప్రభుత్వ 2014-19 కాలంలో స్థూల ఉత్పత్తి సగటున రూ.6,95,000 ఉండగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి సగటున రూ.10,24,000 నమోదైందన్నారు. ఈ గణాంకాలే ప్రతిపక్షాల ప్రచారాలు అబద్ధాలనడానికి నిదర్శనమన్నారు. పెండింగ్ బిల్లులు రూ.1.71 లక్షల కోట్లు అనే ఆరోపణలకు రుజువేది? ఆధారమేది? చెప్పాలన్నారు. సీఆర్డీఏ బాండ్లు పెట్టి రూ.1500 కోట్ల అప్పు చేసింది టీడీపీ కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారిక నివేదికల గణాంకాలను దాచిపెట్టి గజిబిజి లెక్కలతో విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు.
చంద్రబాబుకు, లోకేశ్ కు మేము పేరు పెట్టలేమా?
చంద్రబాబు ఊరూరు వెళ్లి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతుండడం పట్ల రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లకు పేర్లు పెట్టలేమా అని ప్రశ్నించారు. ఆయన వయసుకు ఇలా పేర్లు పెట్టడం పద్ధతిగా ఉంటుందా? లోకేశ్ ను రేలంగి అనలేమా? ఎమ్మెల్యేలు చంద్రబాబుకు పేర్లు పెట్టలేరా? అని ప్రశ్నించారు. మాకు సంస్కారం ఉంది కాబట్టే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. అన్ని పార్టీలతో దోస్తీ చేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుందన్నారు. అవసరాలు, అవకాశాలను బట్టి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలనే తేడా లేకుండా అందరితో జతకడతారన్నారు.అధికార దాహం మినహా ఒక విధానం, సిద్ధాంతం పాటించని పార్టీ నారా చంద్రబాబునాయుడు గారి టీడీపీ మాత్రమేనన్నారు. పోలవరం పూర్తి కాకపోవడానికి, ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసే రాష్ట్ర విభజన చేశాయన్నారు.ఏపీ అప్పులకు కూడా చంద్రబాబే కారణమన్నారు. ఇబ్బంది కలిగే నిర్ణయాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేలా చేసిన పనులే లేవన్నారు. రాయలసీమ వాళ్లు అమాయకులని వరాలిచ్చి గాలికి వదిలేశారని మంత్రి బుగ్గన అన్నారు. ఆలూరులో జింకల పార్కు, శ్రీశైలంలో పులుల పార్కు ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కర్నూలు జిల్లా స్మార్ట్ సిటీ, అవుకు పారిశ్రామిక వాడ, విత్తనాల శుద్ధి కేంద్రం సహా ఇలా ఎన్నో అబద్ధాల వరాలిచ్చి వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు.