Sunday, January 19, 2025
HomeTrending Newsజగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.  రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇది తనది కాదులే అని ప్రజలు అనుకుంటే రేపటి రోజున మీ పిల్లల పేర్ల ముందు కూడా జగన్ మోహన్ రెడ్డి పేరే పెట్టాలని చట్టం తీసుకు వస్తారని హెచ్చరించారు. చివరకు ఈ రాష్ట్రం పేరును కూడా జగనాంధ్ర ప్రదేశ్ గా మారుస్తారని వ్యాఖ్యానించారు.

విజయవాడ డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ తీసుకు వస్తున్న బిల్లును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీవ్ర నిరసన తెలియజేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు ఈ ముసాయిదా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పైకి విసిరి వేశారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో టిడిపి సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో కేశవ్ మీడియాతో మాట్లాడారు.

జగన్ స్టిక్కర్ సిఎంగా మిగిలిపోతారనే దానికి ఈ పేరు మార్పే నిదర్శనమని కేశవ్ విమర్శించారు. ఈ వ్యవహారంపై సొంత పార్టీలోనే రహస్య ఓటింగ్ తీసుకోవాలని సవాల్ విసిరారు. అన్న ఎన్టీఆర్ పేరు మార్చే సాహసం చేశారంటే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లేనని దుయ్యబట్టారు. నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు విద్యారంగంలో వేసిన అడుగులు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్పోరేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు నాంది పలికింది నిమ్స్ ఆస్పత్రి అని, నిమ్స్ ను తీర్చిదిద్దింది ఎన్టీఆర్ అని కేశవ్ వివరించారు. ఎన్టీఆర్ ను ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక రాజకీయ పార్టీకో రంగుపూసి చూడడం దుర్మార్గమన్నారు.

 వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తీసుకువస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి దానికి వైఎస్ పేరు పెట్టుకోవాలని సూచించారు. ఈ పేరు మార్పు వ్యవహారంపై ఇంటా బైటా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Also Read: సిఎం జగన్ కుప్పం టూర్ ఒకరోజు వాయిదా

RELATED ARTICLES

Most Popular

న్యూస్