ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, దీనితో ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మాజీ ఆర్ధిక శాఖమంత్రి, టిడిపి నీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు మొదటిసారిగా చూస్తున్నామని, ఇది జగన్ పాలనా వైఫల్యమేనని ఆరోపించారు.
రాష్ట్ర అప్పుల నివేదిక చూసి కేంద్ర అధికారులు నివ్వెరపోయారని యనమల అన్నారు. తెలంగాణా రాష్ట్ర అప్పుల నిష్పత్తి17శాతంగా ఉంటే ఏపిలో 31.46 శాతంగా ఉందని వెల్లడించారు. అప్పుల జాబితాలో దేశంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని వివరించారు.
మరోవైపు తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జిఓ.34 కు వ్యతిరేకంగా రాష్ట్ర రైతాంగం హైకోర్టును ఆశ్రయిస్తే ఏపి ప్రభుత్వం సహకరించలేదని, సిఎం జగన్ లేఖలతోనే కాలక్షేపం చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే నీటి వివాదాలు సృష్టించారని, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న జగన్నాటకం అని అయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదని, బకాయిలను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేసియార్ కు జగన్ తాకట్టు పెట్టారని ధూళిపాళ్ల దుయ్యబట్టారు.