Monday, January 20, 2025
HomeTrending Newsమండల్ కు అవమానం దుర్మార్గానికి పరాకాష్ట: అచ్చెన్న

మండల్ కు అవమానం దుర్మార్గానికి పరాకాష్ట: అచ్చెన్న

గుంటూరులో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకోసం ఏర్పాటు చేసిన దిమ్మె కూల్చివేయడం దారుణమని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యకం చేశారు. ఈ ఘటనపై ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అచ్చెన్నాయుడు ప్రకటన యధాతథంగా…

“బడుగు బలహీన వర్గాల అభ్యుదయ రథ సారధి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటుకు ఉద్దేశించిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గం. మాజీ హోం మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీహార్ నుండి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి మనుమడు ఎంతో గొప్పగా గౌరవ సూచకంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహ దిమ్మెను కూల్చివేయడం జగన్ రెడ్డి దుర్మార్గానికి పరాకాష్ట. బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశలను కూల్చివేయడం ఎన్నటికీ సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.

అధికార పక్షంలో ఉండి కూడా బీసీ వర్గాలపై జరిగే దాడులను నిరసించి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. మైనార్టీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అరాచకాలను ఎదురించిన బడుగుల బాంధవుడు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్ర నిర్ణయాన్ని కూడా ఎదురించి బడుగుల కోసం పోరాడిన ధీశాలి బి.పి.మండల్. పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వ, విద్య సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు అండగా నిలిచారు. దేశంలో 52 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన వాటా ఇచ్చినపుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని ఎలుగెత్తి చాటారు. శాస్త్రీయంగా న్యాయస్థానాల్లో బీసీ రిజర్వేషన్లు వీగిపోకుండా నివేదిక తయారు చేసి అందించిన మహనీయుడు బి.పి. మండల్. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం, సమాజం పట్ల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మండల్ విగ్రహ దిమ్మెను కూల్చివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను జగన్ రెడ్డి అవమానించారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా విగ్రహ దిమ్మెను కూల్చాల్సిన అవసరం ఏమిటి? బీసీలను ఉద్దరించానని చెప్పుకుంటూ బీసీ వర్గాలు దేవుడిగా భావించే మండల్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం కుట్ర కాదా? జగన్ రెడ్డి చేస్తున్న నీతి మాలిన, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక చర్యలు త్వరలోనే ఆయన అధికారానికి సమాధి కట్టబోతున్నాయని గుర్తుంచుకోవాలి” అంటూ అచ్చెన్నాయుడు ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్