తెలుగుదేశం పార్టీలో సరిగా పనిచేయని నాయకులకు భవిష్యత్తులో గుర్తింపు ఉండదని, ఈ విషయంలో తనకు కూడా మినహాయింపు లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించిన వారు కష్టపడి పనిచేయకపోతే వారికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. పార్టీ తరఫున స్వచ్చందంగా సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తామని, అయితే వారు ఆయా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు ముందుగా సమాచారమివ్వాలని… నాయకుల సామర్ధ్యాని బట్టి టిక్కెట్ల కేటాయింపు నిర్ణయం ఉంటుందని తెలిపారు. మహానాడు ప్రాంగణంలో లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. స్వార్ధంతో పార్టీ వీడిన వారు తిరిగి వస్తామంటే తీసుకోబోమని, వారి స్థానంలో కొత్త తరం నాయకులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
మహానాడు వేదికగా రేపు యువతకు ఓ శుభవార్త ప్రకటిస్తామని లోకేష్ వెల్లడించారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే సమయానికి ఈ ప్రాంత అభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తాగు, సాగునీటి వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై దీనిలో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటివరకూ జరిగిన యాత్రతో సీమ ప్రజలు తమవైపే ఉన్నారని స్పష్టంగా తేలిందన్నారు లోకేష్, 2019లో ఏపీ కంటే తెలంగాణా ఆదాయం 4 వేల కోట్ల రూపాయలు అధికంగా ఉండేదని, జగన్ నాలుగేళ్ల పాలనలో అది పది రేట్లకు పెరిగిందని లోకేష్ ఆవేదానా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీ ఆదాయం పెంచుతామని చెప్పారు.