ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.
తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్ తెలిపారు.