Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంల సమావేశ అజెండా సమస్యలా..? రాజకీయాలా..?

సిఎంల సమావేశ అజెండా సమస్యలా..? రాజకీయాలా..?

సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు.

విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ ఏపీ సీఎం. చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బిసి జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ లు పాల్గొంటున్నారు. సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల సంస్థల పంపిణీ, ఈ ఏడాది జూన్‌ 2తో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసినందున ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న సీఐడీ హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం అప్పగింత, నదుల్లో నీటి వాటా, విద్యుత్తు బకాయిలపై పేచీ పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు తిరిగి ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. టిటిడిలో తెలంగాణకు వాటా ఇవ్వాలని కోరుతోంది. ఈ దిశగా అజెండా ఖరారు అయింది.

గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. నాటి సమావేశంలో ఉద్యోగుల సమస్యలు కొంత వరకు పరిష్కరించినా ప్రధాన సమస్యలు అపరిష్క్రుతంగానే ఉన్నాయి. ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న సమావేశం ఫలవంతం కావాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

ముఖ్యమంత్రుల సమావేశం మీద రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. గతంలో కెసిఆర్, జగన్ లు సమావేశమైనా.. రాష్ట్ర సమస్యల కన్నా రాజకీయ అంశాలపైనే దృష్టి కేంద్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి. బాబు, రేవంత్ రెడ్డిల సమావేశంలోను ఇంత కన్నా గొప్ప ఏమి ఉండదని అంచనా.

ఏపికి అనుకూలంగా ఏ నిర్ణయాలు జరిగినా రేవంత్ రెడ్డి బాబు ఒత్తిడికి తలొగ్గారని తెలంగాణలో విమర్శలు మొదలవుతాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు జరిగితే బాబు ఆస్థులు హైదరాబాద్ లో ఉండటంతో సానుకూలంగా ఉన్నారని ఏపిలో ఆరోపణలు వస్తాయని అంటున్నారు.

సమావేశాల్లో ప్రజా ప్రయోజన అంశాల కన్నా రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా చర్చలు జరగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, విపక్ష పార్టీల పట్ల అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై గురు శిష్యులు మంతనాలు జరుపుతారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్