లోకసభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే దృష్టి సారించింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఈ రోజు (సోమవారం) జరిగిన కాంగ్రెస్ రాజాకీయ వ్యవహారాల కమిటీ సమీవేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ…తెల్ల రేషన్ కార్డులు కొత్తగా జారీపై చర్చ జరిగింది. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళుతూ… లోకసభ ఎన్నికల నాటికి ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా చేరుకునేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బిజెపితో పోటీ ఉంటుందని…పార్టీ శ్రేణులను సిద్దం చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఓటరు బిజెపి వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయని మొన్నటి ఎన్నికల సందర్భంగా వివిధ సర్వేల్లో బయటపడింది. దీన్ని అడ్డుకొని పార్టీకి వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి గెలిపించాలని పిసిసి నాయకత్వం భావిస్తోంది.
మరోవైపు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరటం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. సోనియాగాంధీ లేదా ప్రియంక గాంధి రాష్ట్రం నుంచి బరిలోకి దిగేలా ఒప్పించాలని…తద్వారా పార్టీ క్యాడర్ లో ఉపు వస్తుందని అంచనాతో ఉన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీకి దిగితే కరీంనగర్ లేదా మహబూబ్ నగర్ స్థానాల నుంచి బరిలో దింపాలని సిఎం ఆలోచన అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో లోకసభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జులను నియమించారు. సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రెండేసి నియోజకవర్గాలు..ఇతర మంత్రులకు ఒక నియోజకవర్గం అప్పచెప్పారు. మహబూబ్ నగర్, చేవెళ్ళ నియోజకవర్గాలకు సిఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నల్గొండ ఉత్తమ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ – పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి- శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ – మెదక్, జహిరాబాద్ – పీ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ – సీతక్క, మహబూబాబాద్, ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వరంగల్ – కొండ సురేఖ, నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణరావు, మల్కాజ్ గిరి తుమ్మల నాగేశ్వర్ రావులకు ఇంచార్జ్ ఇచ్చారు.
ఎండల తీవ్రత నేపథ్యంలో లోకసభ ఎన్నికలకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా ఢిల్లీ స్థాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు నెలలే ఉండటంతో పార్టీ నేతలు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ…ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
లోకసభ ఎన్నికలకు వివిధ స్థానాలపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ కృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, హైదరాబాద్ నుంచి అజరుద్దీన్ లేదా ఫిరోజఖాన్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంత్ రావు ఇలా పలు స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
-దేశవేని భాస్కర్