‘‘ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు రేవంత్ రెడ్డి. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. ధరణి దోపిడీపై శోధిస్తున్న కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి అని రేవంత్ అన్నారు.
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు కట్టబెట్టారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టల్ ద్వారా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాస్తవానికి దివాళా తీసిన కంపెనీ. గతంలో రూ.90 వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పుని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్..ధరణి నిర్వహణ కోసం సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 52.26 శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1275 కోట్లకు 2021, నవంబర్ 25న అమ్ముకుంది. కొనుగోలు చేసే కంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీని 2021, అక్టోబర్లో ప్రారంభించారు. ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి శ్రీధర్ రాజు చేరారు. దాంతో ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది.
.‘‘ ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. ఐఎల్‌ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్‌కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నా. ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఐఎల్‌ఎఫ్ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది.70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్ సంస్థకు విక్రయించారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
‘‘ శ్రీధర్ రాజుకు, కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. సత్యరామలింగరాజు కుమారులకు శ్రీధర్ రాజుకు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అరవింద్ కుమార్ లీగల్ నోటీసులను రిజిస్టర్ పోస్టు లేదా పర్సన్ ద్వారా నాకు పంపాలి.. కానీ పబ్లిక్ డొమైన్ లో ఎలా పబ్లిష్ చేస్తారు… మీడియాకు ఎలా రిలీజ్ చేస్తారు? ఉద్దేశపూర్వకంగానే అరవింద్ కుమార్ నా ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించారు. రాజకీయంగా ఇతర పార్టీలకు లాభం చేకూరేలా ప్రవర్తించారు” అని అరవింద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓఆర్ఆర్ సగ భాగం వరకు నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఓఆర్ఆర్ టెండర్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రక్రియ ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం, ఎన్ హెచ్ఎఐ నిబంధనలను పట్టించుకోకపోవడం, ఐఏఎస్ అధికారి స్థానంలో రిటైర్డ్ అధికారితో టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం వంటి సందేహాలకు అరవింద్ కుమార్ సమాధానం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. ఒక ప్రజాప్రతినిధిగా నేను సందేహాలకు సమాధానం ఇవ్వకపోగా రాజకీయ నాయకుడిగా మాదిరిగా వ్యవహరించారు. 1968 ఇండియన్ సర్వీసెస్ రూల్స్ మేరకు ఒక ప్రజాప్రతినిధితో ఒక అధికారి వాడని భాషను అరవింద్ ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. క్రిసిల్ నివేదిక, మేజర్స్ నివేదిక, టెండర్ బేస్ ప్రైస్, గత మూడేళ్లుగా నెలనెలా ఓఆర్ఆర్ ఆదాయం వివరాలను వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీహరి రావు
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కూచాడి శ్రీహరి రావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువాకప్పి శ్రీహరి రావును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని దీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన నోముల ప్రకాష్ గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువాకప్పి ప్రకాష్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాష్ గౌడ్ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గ్రేటర్ లో సెల్ఫీలు దిగే వారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవారు ఎక్కువయ్యారు అని బీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేశారు.