కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్ని విషయాలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించిందని, కొవిడ్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలను వివరిస్తూ రాసిన పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై స్వయంగా ప్రధానికి ఢిల్లీలో అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ను ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసిందన్న గవర్నర్ తమిళిసై రాష్ట్రప్రభుత్వం వ్యాక్సినేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. Coivd అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసిందన్నారు. హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుందని, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాన్ని అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నామని తమిళిసై వెల్లడించారు.
తెలంగాణ పుదుచ్చేరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటానికి ఈ కార్యక్రమం తోడ్పడిందని, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని తమిళిసై చెప్పారు. తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలోనీ గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్న గవర్నర్ ఇందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు.