తెలంగాణా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖను పెంచుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 24 మంది ఉన్న జడ్జిల సంఖ్యను 42కు పెంచారు. వీరిలో 32 మంది శాశ్వత జడ్జిలుగా, మరో 10 మంది అడిషనల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు.
తెలంగాణా హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలని రెండేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసియార్ పలుమార్లు ప్రధాన మంత్రికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తులు ఇస్తూ వస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని కూడా స్వయంగా కలిసి విన్నవించారు.
ఏప్రిల్ లో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎన్వీ రమణ న్యాయ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ తయారీ, కోర్టు ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పడం లాంటివి వీటిలో కొన్ని.
ఇదే కోవలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులు, కొరతపై కూడా రమణ దృష్టి పెట్టారు. తెలంగాణాలో ఏకంగా ప్రస్తుతం ఉన్న సంఖ్యకు 75 శాతం అదనంగా జడ్జిలను నియమించారు.