వచ్చే నెల(జూన్)లో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం… హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం,ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం,ఫౌంటైన్ ఏరియా,గ్రానైట్ ఫ్లోరింగ్,ఫోటో గ్యాలరీ,ఆడియో, విజువల్ రూం,లిఫ్ట్ లు,ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్,పై అంతస్థులో రెస్టారెంట్,నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎం కేసిఆర్ ఆదేశానుసారం అధికారులకు,నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో,సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని చెప్పారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నాయని అన్నారు.
ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలన్నారు.ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని,పర్ట్ చార్ట్ ప్రకారం పనులు పూర్తి చేసి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్దం చేయాలని అదేశించారు. అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు,ఆర్కిటెక్ట్, తదితరులు పాల్గొన్నారు.