Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్సీగా దేశపతి శ్రీనివాస్ కు చాన్స్

ఎమ్మెల్సీగా దేశపతి శ్రీనివాస్ కు చాన్స్

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి లను బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సిఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.


కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.

దేశపతి శ్రీనివాస్ :

తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో స్వర్గీయ శ్రీ దేశపతి గోపాలకృష్ణ శర్మ, శ్రీమతి బాలసరస్వతి దంపతులకు 1970లో జన్మించారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నాయకుడు, నేటి రాష్ట్ర సారథి సీఎం కేసీఆర్ గారు నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలలో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ఆటా పాటలు ప్రసంగాలతో భావజాల వ్యాప్తికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓ.ఎస్.డి.గా పని చేస్తున్నారు. దేశపతి కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనకు శాసనమండలి అభ్యర్థిగా అవకాశమిచ్చారు.

కుర్మయ్య గారి నవీన్ కుమార్ :

హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్ కుమార్ 1978 మే 15న జన్మించారు. వారి తల్లిదండ్రులు కొండల్ రావు, తిలోత్తమ గార్లు. నవీన్ కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. నవీన్ కుమార్ మేనమామ సుదర్శన్ రావు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్ కుమార్ కు రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ మొదలుకొని టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ క్రియాశీలంగా పనిచేశారు. వ్యాపారం, రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా నవీన్ కుమార్ చురుగ్గా పాల్గొంటారు. కూకట్ పల్లి హైదర్ నగర్ లో సొంత ఖర్చులతో వెంకటేశ్వర ఆలయాన్ని నవీన్ కుమార్ నిర్మించారు. ఆయన 2019 మే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 మార్చి వరకు ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ గారు నవీన్ కుమార్ కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

చల్లా వెంకట్రామిరెడ్డి :

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి తొలుత పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చల్లా వెంకట్రామిరెడ్డి 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్