Saturday, November 23, 2024
HomeTrending Newsమత్స్యకార సొసైటీల్లో తెలంగాణ టాప్‌

మత్స్యకార సొసైటీల్లో తెలంగాణ టాప్‌

దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి. రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కారణంగా గత ఐదేండ్లలో రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల విలువైన మత్స్య సంపద చేతికొచ్చింది. ఈ సంపద ప్రతి మత్స్యకారుడికి చెందాలన్న ఉద్దేశంతో మత్స్యశాఖ సొసైటీలను బలోపేతం చేస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి సొసైటీల్లో సభ్యత్వం కల్పించేందుకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి మత్స్యకారులకు నైపుణ్య పరీక్ష (వల అల్లడం, వల విసరడం, చెరువులో నడవడం, ఈత కొట్టడం)లు నిర్వహిస్తున్నారు. ఒక నెలలోనే 419 సొసైటీలను ఏర్పాటుచేసి, 10,566 మందికి సభ్యత్వం కల్పించారు. మరో నెల రోజుల్లో 1,177 కొత్త సొసైటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

సొసైటీల ఏర్పాటుతో లాభాలు
సొసైటీల ఏర్పాటు, సభ్యత్వంతో మత్స్యకారులకు అనేక హక్కులు సంక్రమిస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. చెరువులపై ఆయా సొసైటీలకు అధికారం లభిస్తుంది. చేపలు పెంచడం, పట్టడం, విక్రయించడం అంతా సొసైటీ సభ్యుల చేతుల్లోనే ఉంటుంది. తద్వారా వారికి ఉపాధి లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చెరువులపై అధికారం కోసం రెండు వర్గాల మధ్య నిత్యం వివాదాలు కొనసాగుతుండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చొరవతో జేఏసీ ఏర్పాటయ్యింది. ఇరు వర్గాలు ఏకతాటి మీదకు వచ్చాయి. రాష్ట్రంలో గతంలో చెరువులపై అధికారం సర్పంచ్‌లకు ఉండేది. ప్రభుత్వం దీనిని మత్స్యశాఖకు బదిలీ చేసింది. దీంతో మత్స్యకారులకు ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరనున్నది.

మత్స్యకారులకు లక్ష ఆదాయం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో మత్స్యశాఖ అభివృద్ధి చెందుతున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారులకు ఏటా సుమారు రూ.లక్ష ఆదాయం వస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. మరే రాష్ట్రంలోని లేని విధంగా అత్యధిక సొసైటీలు ఏర్పాటు చేస్తున్నాం.
-తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మత్స్యశాఖ మంత్రి

★ రాష్ట్రంలో ప్రస్తుత మత్స్యకార
సొసైటీలు 4,793

★ కొత్తగా ఏర్పడుతున్న
సొసైటీల సంఖ్య 1,177

★ మొత్తం మత్స్యకార
సొసైటీల సంఖ్య 5,970

★ మహారాష్ట్రలో ఉన్న
సొసైటీల సంఖ్య 3,315

★ ఏపీలో ఉన్న మత్స్యకార
సొసైటీలు 2,347

Also Read : సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు

RELATED ARTICLES

Most Popular

న్యూస్